బీమా పాలసీ ప్రీమియంలపై జీఎస్టీ రద్దు - తగ్గనున్న భారం

ఠాగూర్

సోమవారం, 8 సెప్టెంబరు 2025 (14:54 IST)
ఆరోగ్య, జీవిత బీమా పాలసీలు తీసుకునేవారికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించింది. ఇప్పటివరకు ఈ పాలసీల ప్రీమియంలపై విధిస్తున్న 18 శాతం జీఎస్టీని పూర్తిగా రద్దు చేసింది. జీఎస్టీ విధానంలో చేపట్టిన విస్తృత మార్పుల్లో భాగంగా ఆరోగ్య, జీవిత బీమాలను సున్నా పన్ను కేటగిరీలోకి తీసుకువస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ నిర్ణయంతో బీమా పాలసీలు సామాన్యులకు మరింత అందుబాటులోకి రానున్నాయి.
 
పండుగ సీజన్‌కు ముందు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వినియోగాన్ని పెంచడానికి దోహదపడుతుందని, ఎక్కువ మంది ప్రజలు బీమా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు, తొలిసారి బీమా కొనేవారికి ఇది ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. టర్మ్ లైఫ్, యూలిప్, ఎండోమెంట్ వంటి అన్ని రకాల వ్యక్తిగత జీవిత బీమా పాలసీలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది.
 
అయితే, ఈ నిర్ణయం వల్ల బీమా కంపెనీలపై స్వల్పకాలికంగా కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా (ఐసీఆర్ఏ) అంచనా వేసింది. జీఎస్టీ రద్దుతో కంపెనీలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) లభించదని, దీనివల్ల వారి లాభదాయకత కొంతమేర తగ్గొచ్చని పేర్కొంది. కానీ, ప్రీమియంలు తగ్గడంతో పాలసీల అమ్మకాలు గణనీయంగా పెరిగి, దీర్ఘకాలంలో కంపెనీలకు మేలు జరుగుతుందని అభిప్రాయపడింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు