మహారాష్ట్ర నుంచి తెలంగాణాకు హై స్పీడ్ రైలు - మార్గంపై కసరత్తు

గురువారం, 18 నవంబరు 2021 (12:41 IST)
దేశంలో హై స్పీడ్ రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వే శాఖ దృష్టిపెట్టింది. ఇందులోభాగంగా, మహారాష్ట్రలోని ఠాణె నుంచి సంగారెడ్డి జిల్లాలోని కొల్లూరు వరకు హైస్పీడ్‌ రైలు మార్గాన్ని నిర్మించే అంశంపై కసరత్తును ప్రారంభించింది.
 
ఇదే అంశంపై నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు బుధవారం జిల్లా కలెక్టరేట్‌లో ఈ ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. కొల్లూరు స్టేషన్‌ నుంచి ఈ రైలు బయలుదేరేలా ప్రణాళిక వేస్తున్నట్లు వారు వివరించారు. ఈ స్టేషన్‌ పేరును హైదరాబాద్‌గా వ్యవహరించే అవకాశముందని తెలిపారు.
 
ఈ మార్గంలో హైదరాబాద్‌ (కొల్లూరు), వికారాబాద్‌, గుల్బర్గా, షోలాపుర్‌, పండరీపుర్‌, బారామతి, పుణె, లోనావాలా, నవీ ముంబై, ఠాణె మొత్తం పది స్టేషన్లుంటాయి. పది బోగీలు.. 750 మంది ప్రయాణికుల సామర్థ్యంతో ఇది నడుస్తుందని, ప్రాజెక్టు పూర్తికి 1,197.5 హెక్టార్ల భూమిని సేకరించాల్సి ఉంటుందని అంచనా వేశామని వారు తెలిపారు.
 
ప్రస్తుతం సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ను సిద్ధం చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో డీపీఆర్‌ పూర్తి కావొచ్చని కన్సల్టెన్సీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ రైలు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి ముంబయికి మూడు గంటల్లో చేరుకోవచ్చని వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు