4వేల మెగావాట్ల పీవీ మాడ్యుల్ తయారీ కోసం ఐఆర్‌ఈడీఏ బిడ్ గెలుచుకున్న షిర్డీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్
శుక్రవారం, 12 నవంబరు 2021 (23:09 IST)
నూతన మరియు పునరుత్పాదక శక్తి (ఎంఎన్‌ఆర్‌ఈ) మంత్రిత్వ శాఖ ఆరంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ (పీఎల్‌ఐ) కింద అత్యధిక సామర్థ్యం కలిగిన సోలార్ పీవీ మాడ్యుల్స్ కోసం తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు హైదరాబాద్ కేంద్రంగా కలిగిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌ఈఎల్)కు అనుమతిని ఇండియన్ రెన్యువబల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఐఆర్‌ఈడీఏ) మంజూరు చేసింది.
హై ఎఫిషియెన్సీ సోలార్ పీవీ మాడ్యుల్స్ కోసం తయారీకేంద్రాలను ఏర్పాటుచేసేందుకు ఐఆర్‌ఈడీఏ బిడ్లను ఆహ్వానించింది. ఇక్కడ నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో పాలీసిలికాన్+ఇన్గాట్–వాటర్+సెల్+మాడ్యుల్ ఏర్పాటుచేసేందుకు బిడ్‌ను గెలుచుకుంది.
ట్రాన్స్‌మిషన్ మరియు పంపిణీ రంగంలో అతిపెద్ద సంస్థలలో ఒకటి షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్. విభిన్న రకాల ట్రాన్స్‌ఫార్మర్లను తయారుచేయడంలో 25 సంవత్సరాల అనుభవం సంస్థకు ఉంది. ఈపీసీ ప్లేయర్‌గా 80వేల కిలోమీటర్ల ఎల్‌టీ మరియు ట్రాన్స్‌మిషన్ లైన్స్‌ను ఎస్‌ఎస్‌ఈఎల్ వేసింది.
2022నాటికి 1.75 లక్షల మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుచేయడంతో పాటుగా 2030 నాటికి 4.5 లక్షల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలని ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది. టెక్నో ఎకనమిక్ విశ్లేషణ, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అధారిటీ (సీఈఏ) గణాంకాల ఆధారంగా 2029-30నాటికి 2,80,000 మెగా వాట్ల సౌర విద్యుత్ కావాల్సి ఉంది. అలా కావాలంటే సంవత్సరానికి 25వేల మెగావాట్ల ఇన్‌స్టాలేషన్స్ చొప్పున 2030 వరకూ ఏర్పాటుచేయాలి. సోలార్ పీవీ సెల్స్ కోసం అధికంగా దిగుమతులపై మనం ఆధారపడుతున్నాము.
దేశీయ తయారీ పరిశ్రమకు కేవలం 2500 మెగావాట్ల సోలార్ పీవీ సెల్స్, 9-10వేల మెగావాట్ల సోలార్ పీవీ మాడ్యుల్స్‌ను మాత్రమే ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అది దృష్టిలో పెట్టుకుని పీఎల్‌ఐ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
తాము బిడ్ గెలుచుకోవడం గురించి ఎస్‌ఎస్‌ఈఎల్ సీఈవో శ్రీ శరత్ చంద్ర మాట్లాడుతూ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో భాగం కావడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నామన్నారు. ఈ తయారీ కార్యక్రమాల ద్వారా భావితరాల కోసం స్వచ్ఛమైన వాతావరణం కోసం తోడ్పాటునందించనుండటానికి కట్టుబడి ఉన్నామన్నారు..