దసరా, దీపావళి పండుగలకు ఊరెళ్లాలనుకునేవారికి శుభవార్త. భారతీయ రైల్వే మరో 392 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. 196 రూట్లలో ఈ రైళ్లు సేవలు అందించనున్నాయి. కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా మార్చి 25 నుంచి భారతీయ రైల్వే సేవలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మే 1 నుంచి దశల వారీగా రైళ్లను ప్రకటిస్తోంది రైల్వే. ఇటీవల 39 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఆ రైళ్లు అక్టోబర్ 13 నుంచి అందుబాటులోకి వచ్చాయి. వాటిలో తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లే స్పెషల్ ట్రైన్స్ ఉన్నాయి.
ఈ 392 స్పెషల్ ట్రైన్స్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రాంతాల మీదుగా వెళ్లే రైళ్లు ఉన్నాయి. పూర్తి వివరాలు రావాల్సి ఉంది. ఇవి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ మాత్రమే. నవంబర్ 30 వరకే సేవలు అందిస్తాయి. పండుగ సీజన్ సందర్భంగా అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 మధ్య 200 రైళ్లను నడుపుతామని రైల్వే బోర్డ్ ఛైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ ఇటీవల ప్రకటించారు.