ఎంతసేపూ వ్యాపారమేనా? ప్రజల దుస్థితి పట్టదా? కష్టకాలంలో వడ్డీపై వడ్డీనా?

బుధవారం, 26 ఆగస్టు 2020 (16:13 IST)
కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు మరోమారు కడిగిపారేసింది. ఎంతసేపూ వ్యాపార కోణంలో ఆలోచించడమే తప్పా ప్రజల దుస్థితి పట్టదా అంటూ నిలదీసింది. పైగా, కరోనా కష్టకాలంలో వడ్డీలపై వడ్డీలా? అంటూ ప్రశ్నించింది. ఆర్బీఐ పేరు చెప్పి ఎంతకా దాక్కుంటారని వ్యాఖ్యానించింది. 
 
కరోనా మహమ్మారి దెబ్బకు కేంద్రం లాక్డౌన్ అమలు చేసింది. దీంతో భారత రిజర్వు బ్యాంకు కూడా స్పందించి, వివిధ రకాల రుణాలపై ఆర్నెల్ల మారటోరియం విధించింది. ఈ మారటోరియం వ్యవధిలో వడ్డీ మాఫీ కాలేదు. దీనిపై కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీన్ని విచారణకు స్వీకరించిన కోర్టు... తీవ్రంగా స్పందించింది. 
 
ఆరు నెలల రుణ మారటోరియం కాలానికి వడ్డీని మాఫీ చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలని కోరింది. వడ్డీ మీద వడ్డీ విధిస్తారా అంటూ గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీం బుధవారం మరోసారి కేంద్రం వైఖరిపై మండిపడింది. ఆర్‌బీఐ పేరు చెప్పి ఎంతకాలం దాక్కుంటారని  వ్యాఖ్యానించింది. 
 
కరోనా కష్టకాలంలో ప్రవేశపెట్టిన ఆర్థిక ఉద్దీపన వల్ల ఎంత మందికి ప్రయోజనం, నిజంగా ప్రజలకు మేలు జరిగిందా? అని ప్రశ్నించింది. వ్యాపార ఉద్దేశ్యాలు పక్కనబెట్టి ప్రజలకష్టాలు తీర్చాలని సూచించింది. దీనిపై సెప్టెంబర్‌ ఒకటో తేదీ నాటికి పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్రాన్ని ఆదేశించింది. 
 
ఇప్పటివరకూ పరిశ్రమకు సంబంధించిన ఆందోళనలతోనే ఆర్‌బీఐ సరిపెట్టుకుందని, ప్రభుత్వం కూడా ఆర్‌బీఐ వెనుక దాక్కుంటోందని సుప్రీం విరుచుకుపడింది. వడ్డీ మాఫీ, వడ్డీపై వడ్డీ మాఫీ అంశంపై విపత్తు నిర్వహణ చట్టం ప్రకారం కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని పేర్కొంది. 
 
వడ్డీ మాఫీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందన దాఖలు చేయాలని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం కేంద్రాన్ని ఆదేశించింది. అనంతరం విచారణను సుప్రీంకోర్టు సెప్టెంబరు ఒకటో తేదీకి వాయిదా వేసింది. ప్రభుత్వం వ్యాపారం గురించి మాత్రమే కాకుండా ప్రజల దుస్థితి గురించి కూడా ఆలోచించాలని హితవు చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు