మళ్లీ బాదుడు.. జూన్ 18న పెరిగిన పెట్రోల్ - డీజల్ ధరలు

శుక్రవారం, 18 జూన్ 2021 (08:43 IST)
దేశ వ్యాప్తంగా ఇంధన ధరల పెరుగుదలకు అడ్డుకట్టపడటం లేదు. కరోనా కష్టకాలంలోనూ చమురు కంపెనీలు ఏమాత్రం కనికరం చూపడం లేదు. ఫలితంగా ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచేస్తున్నాయి. దీంతో అనేక రాష్ట్రాల్లో పెట్రోల్ చార్జీలు సెంచరీ కొట్టేశాయి. శుక్రవారం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు కంపెనీలు పెంచాయి. 
 
ఇప్పటికే ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠస్థాయికి చేరగా.. తాజాగా లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 32 పైసలు వరకు పెరిగింది. కొత్తగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ రూ.96.93, డీజిల్‌ రూ.87.69కు పెరిగింది. 
 
మరోవైపు మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో పెట్రోల్‌ రూ.105 మార్క్‌ను దాటింది. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పెట్రోల్‌ ధర రూ.103కి చేరింది. మరో వైపు రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో పెట్రోల్‌ రూ.108.07 డీజిల్‌ రూ.100.82కు చేరింది.
 
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ.. దేశంలోని చమురు కంపెనీలు మాత్రం ధరల బాదుడు మాత్రం వదిలిపెట్టడం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత మే 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు 27 సార్లు ధరలు పెరగ్గా.. పెట్రోల్‌పై రూ.6.61, డీజిల్‌ రూ.6.91 పెరిగింది. ఫిబ్రవరి 26న ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడగా.. చివరిసారిగా ఫిబ్రవరి 27న ధరలు పెరగ్గా.. ఆ తర్వాత ధరలు పెరుగలేదు. 
 
ఇకపోతే తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలో కూడా ఈ ధరల పెరుగుదల ప్రభావం ఉంది. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ.100.74, డీజిల్ రూ.95.59 ఉండగా, విజయవాడలో పెట్రోల్‌ రూ.102.69, డీజిల్‌ రూ.96.97 చొప్పున వుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు