పంజాబ్ నేషనల్ బ్యాంకు (పీఎన్బీ స్కామ్) ప్రభావం మరింత మంది బ్యాంకర్లను కలవరపెడుతోంది. ఈ కేసులో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు చీఫ్ శిఖా శర్మలకు అవినీతి వ్యతిరేక సంస్థ ఎస్‌ఎఫ్ఐవో నోటీసులు జారీచేసింది. ముకుల్ చోక్సీకి చెందిన గీతాంజలి నగల సంస్థకు రుణాలు మంజూరు చేయడంపై విచారణ జరిపేందుకు ఈ ఇరువురు టాప్ బ్యాంకర్లకు నోటీసులు జారీచేసినట్టు చెబుతున్నారు.
సూరత్‌కు చెందిన ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలను రుణంగా తీసుకుని దేశం విడిచి పారిపోయిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్, యాక్సిస్ బ్యాంకు చీఫ్ శిఖా శర్మలకు ఏసీబీ నోటీలు జారీ చేయడం ఇపుడు దేశ బ్యాంకింగ్ రంగంలో సంచలనంగా మారింది.
కాగా, నీరవ్ మోడీతో తమకెలాంటి సంబంధం లేదని.. గీతాంజలి గ్రూప్‌కు మాత్రమే తాము రుణం ఇచ్చినట్లు ఐసీఐసీఐ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే ఎంత అప్పు ఇచ్చిందనే విషయాన్ని తెలపలేదు. అలాగే, యాక్సిస్ బ్యాంకు కూడా గీతాంజలి గ్రూపునకు భారీగా రుణం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఐదు మేజర్ బ్యాంకులకు చెందిన ఎండీలకు ఈ నోటీసులు జారీచేసినట్టు తెలిసింది.