బ్యాంకు ఖాతాదారుల నుంచి భారీగా చార్జీలను వసూలు చేయాలని ఇప్పటికే ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులు నిర్ణయించగా, ఇపుడు ప్రభుత్వ రంగ దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బిఐ) కూడా ఈ జాబితాలో చేరింది. పొదుపు (సేవింగ్స్) ఖాతాల్లో నెలవారీ కనీస మొత్తాల (మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్, ఎంఎబి)ను ఉంచటంలో విఫలమైన వినియోగదారులపై ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి చార్జీలను విధించనుంది.
మెట్రోపాలిటన్ నగరాల్లోని శాఖల్లో పొదుపు ఖాతాలు ఉన్న వినియోగదారులు తమ ఖాతాల్లో 5,000 రూపాయల కనీస నిల్వ మొత్తాన్ని ఉంచాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ నగదు నిల్వలను ఉంచని ఖాతాదారులపై సర్వీస్ టాక్స్‌తో పాటు 100 రూపాయల అపరాధం విధించనుంది.
50 శాతం కంటే తక్కువ నిల్వలున్న ఖాతాలపై సర్వీస్ టాక్స్‌తో పాటు 50 రూపాయలు, 50-75 శాతం తక్కువ ఉన్న నిల్వలపై సర్వీస్ టాక్స్ సహా 75 రూపాయల పెనాల్టీని బ్యాంకు విధించనుంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాల్లో నగదు నిల్వ 1,000 రూపాయల లోపునకు తగ్గితే లెవీ చార్జీలను విధించనున్నట్లు ఎస్‌బిఐ వెల్లడించింది. ప్రస్తుతం బ్యాంకులో 25 కోట్ల పొదుపు ఖాతాలున్నాయని ఎస్‌బిఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.