రేటు లేదా.. అయితే టమోటాలను కోసి ఎండబెట్టండి... భలే గిరాకీ!

మంగళవారం, 22 డిశెంబరు 2020 (16:03 IST)
నిలకడ లేని ధరలతో టమోటా రైతు చిత్తవుతున్నాడు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ టమోటాల సాగు ఉన్నప్పటికీ అత్యధికంగా పండించేది రాయలసీమ జిల్లాల్లోనే. చిత్తూరు జిల్లా టమోటాల సాగుకు పెట్టింది పేరు. మదనపల్లి మార్కెట్లో ప్రస్తుతం మేలు రకం టమోటా పది కిలోల ధర రూ. 130 ఉంది. ఇది రూ. 100కి పడిపోయే సందర్భాల్లో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. చేతిదాకా వచ్చిన విలువైన ఆహారం వృథా అవుతోంది. ఈ నేపథ్యంలో టమోటాలను ఒరుగులు(ఎండు ఒప్పులు)గా, పొడిగా మార్చి నిశ్చింతగా వాడుకోవచ్చని అనంతపురం జిల్లా రెడ్డిపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రం(08554 200418) సూచిస్తోంది. టమోటా ఒరుగులు, పొడులను నిల్వ ఉంచి వాడినా రుచిలో తేడా లేదని, పోషకాల నష్టం కూడా ఏమీ లేదని కేవీకే అధ్యయనంలో తేలింది.
 
7-10 రోజులు ఎండబెడితే చాలు 
టమోటా ఒరుగులు, పొడి తయారీకి నాణ్యమైన కాయలను ఎన్నుకోవాలి. టమోటాలను శుభ్రంగా నీటిలో కడగాలి. నాలుగు నుంచి 8 ముక్కలుగా కోసి ప్లాస్టిక్ షీట్ మీద 34 డిగ్రీల సెల్షియస్ అంతకుమించిన ఉష్ణోగ్రత ఉన్నప్పుడు.. 7 నుంచి 10 రోజుల వరకూ ఎండబెట్టాలి. ఒరుగుల మీద మంచు పడకుండా జాగ్రత్తపడాలి. పూర్తిగా ఎండిన ఒరుగులను గాలి ప్రసరించే ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేసుకుంటే పాడైపోకుండా ఉంటాయి. కేజీ టమోటాల నుంచి 60 గ్రాముల ఒరుగులు తయారవుతాయి. ఒరుగులను పొడి చేయవచ్చు. కేజీ టమోటాలతో 500 గ్రాముల పొడి తయారవుతుంది.
 
రుచికి, పోషకాలకూ ఢోకా లేదు..! 
నిల్వ చేసిన ఎండు వరుగులను 4 నుంచి 6 గంటల వరకూ నీటిలో నానబెట్టి కూరల్లో వేసుకోవచ్చు. టమోటా పొడిని నేరుగా కూరలోనూ, రసంలోనూ వేసుకోవచ్చు. సూప్ తయారు చేసుకోవచ్చు. రెడ్డిపల్లి కేవీకే ప్రయోగాత్మకంగా కొందరు మహిళలకు టమోటా ఒరుగులు, పొడిని ఇచ్చి వాడించి చూసింది. వీటితో చేసిన వంటకాల రుచి తాజా టమోటాలు వేసినప్పటి మాదిరిగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమైందని కేవీకే పోగ్రాం డెరైక్టర్ డాక్టర్ పీ లక్ష్మిరెడ్డి తెలిపారు. 45 రోజుల పాటు నిల్వ చేసిన టమోటా ఒరుగులు, పొడులపై వ్యవసాయ విశ్వవిద్యాలయ(రాజేంద్రనగర్) నాణ్యతా నియంత్రణ కేంద్రంలో పరీక్షలు జరిపారు. దాదాపుగా తాజా టమోటాల్లో మాదిరిగానే విటమిన్ సి, లైకోపెన్ తదితర పోషక విలువలుండడం విశేషం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు