ఉల్లిధరలు భగ్గుమంటున్నాయి. వారం రోజులుగా ఉల్లిధర అంతకంతకూ పెరుగుతోంది. మొన్నటిదాకా మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.50 ఉండగా , ఇప్పుడు రూ.100కి చేరింది.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు ఉల్లి పంట నీట మునిగి కుళ్లిపోయింది. ట్రాన్స్‌పోర్ట్‌కు అంతరాయం ఏర్పడి మార్కెట్‌లోకి కొత్త స్టాక్ సైతం రావడం లేదు. స్టాక్ తక్కువగా ఉండటంతో ఉల్లికి విపరీతమైన డిమాండ్ పెరిగింది.
ఉదయాన్నే రైతు బజార్‌లకు క్యూ కట్టినా ఉల్లి దొరకని పరిస్ధితి నెలకొంది. సామాన్యులకు ఉల్లి కొయ్యకుండానే కన్నీరు తెప్పిస్తోంది. రిటైల్ మార్కెట్‌లో వంద రూపాయలకు 3 కిలోలు అమ్మిన వ్యాపారులు ఇప్పుడు.. ఒక్కసారిగా ధరలు పెంచేశారు.
నిజానికి వానాకాలంలో ఉల్లిపాయల ధరలు తగ్గాలి. కానీ దేశానికి ఎక్కువగా ఉల్లిని ఉత్పత్తి చేసే... మహారాష్ట్రలో ఆ మధ్య అనుకున్నదాని కంటే ఎక్కువ వర్షాలు పడ్డాయి. దాంతో ఉల్లి పంట దెబ్బతింది.
ఆ ప్రభావం ఇప్పుడు కనిపిస్తోంది. దీంతో మార్కెట్లకు ఉల్లి దిగుబడి బాగా తగ్గింది. ఉన్న నిల్వల్ని రేటు పెంచి అమ్ముతున్నారు. తద్వారా ఉల్లి వ్యాపారులకు కాసుల పంట పండుతోంది.