మనకు ప్రభుత్వ రంగ బ్యాంకులు అవసరమా? వారు లేకుంటే ఆపిల్ - ఐబీఎం ఎక్కడుండేవి : ఆర్బీఐ గవర్నర్

మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (17:42 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు అవసరమా అంటూ ఆయన ప్రశ్నించారు. సోమవారం కొలంబియా విశ్వవిద్యాలయంలో కోటక్ ఫ్యామిలీ విశిష్ట ఉపన్యాసం ఇచ్చారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బ్యాంకింగ్ రంగంలో సంచలన నిర్ణయాలు అవసరమన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనం చేయాలని, ఈ రంగంలో తక్కువ బ్యాంకులు ఉండటం శ్రేయస్కరమని అభిప్రాయపడ్డారు. మనకు అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు అవసరమా? అంటూ ప్రశ్నించారు. వీటిని కొద్ది సంఖ్యకు ఏకీకృతం చేయవలసి ఉందన్నారు.
 
నిరర్థక ఆస్తుల సమస్య పరిష్కారానికి ప్రభుత్వం సహాయానికి బదులుగా కొన్ని బ్యాంకులను విలీనం చేయవచ్చన్నారు. ఇలా చేయడం వల్ల ఆ బ్యాంకుల సమర్థత పెరుగుతుందని చెప్పారు. బలహీన బ్యాంకులు మార్కెట్ వాటాను కోల్పోతున్నాయని, అది మంచిదేనన్నరు. బలంగా ఉన్న బ్యాంకులు, ముఖ్యంగా ప్రైవేట్ రంగ బ్యాంకులు మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయని, ఇది శుభ సూచకమని తెలిపారు. బ్యాంకుల విలీనం వల్ల పొదుపు జరుగుతుందన్నారు.  
 
అలాగే, విదేశీయులు లేకుంటే ఆపిల్, ఐబీఎం, మైక్రోసాఫ్ట్ కంపెనీలు ఎక్కడ ఉండేవని ప్రశ్నించారు. హెచ్ 1-బీ వీసా నిబంధనలను కఠినం చేస్తూ, అమెరికా తీసుకు వచ్చిన నూతన విధానం సరికాదన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న అత్యుత్తమ నాణ్యతగల ఉద్యోగులను తీసుకోవడం వల్లే ఆపిల్, సిస్కో , మైక్రోసాఫ్ట్, ఐబిఎమ్ వంటి కంపెనీలు సత్తా చాటాయని, విదేశీయులే లేకుంటే ఇవన్నీ ఎక్కడుండేవని ప్రశ్నించారు. 
 
సంపద సృష్టికర్తలన్న పేరును తెచ్చుకున్న దేశాలే ఈ తరహా కఠిన వీసా విధానాలను అవలంభించడం తగదన్నారు. సమర్థవంతమైన మార్గంలో వెళ్లాలే తప్ప, వృద్ధికి తీరని నష్టం కలిగించే చర్యలు కూడదని సలహా ఇచ్చారు. దేశీయ ఆర్థికవిధానాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని ఉర్జిత్‌ అన్నారు.

వెబ్దునియా పై చదవండి