రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ప్రపంచ రికార్డు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కేంద్ర బ్యాంకుల్లో ట్విటర్ ఫాలోయర్ల పరంగా.. 10లక్షల మందికి పైగా ఆర్‌బీఐ ట్విట్టర్ ఖాతాను అనుసరిస్తున్నారు. యూఎస్ ఫెడరల్ రిజర్వ్, యురోపియన్ సెంట్రల్ బ్యాంక్‌లను (ఈసీబీ) తోసిరాజని ఈ రికార్డును ఆర్‌బీఐ సొంతం చేసుకోవడం విశేషం. ఆదివారం నాటికి ఆర్‌బీఐ ట్విటర్ ఖాతాను ప్రపంచ వ్యాప్తంగా 10,00,513 మంది అనుసరిస్తున్నట్లు లెక్క తేలింది.
85 ఏళ్ల చరిత్ర ఉన్న ఆర్‌బీఐ 2012 జనవరిలో ట్విటర్ ఖాతా ప్రారంభించింది. గత సెప్టెంబరు 27 నాటికి 9.66 లక్షల మంది ఆర్‌బీఐ ట్విటర్ ఖాతాను అనుసరిస్తుండగా, ఈనెల 22కు ఆ సంఖ్య 10 లక్షలు దాటినట్లు చూపిస్తోంది. 'ఆర్‌బీఐ ట్విటర్ ఖాతా 1 మిలియన్ ఫాలోయర్స్ మార్కును దాటింది. ఇది సరికొత్త మైలురాయి. ఆర్‌బీఐలోని మిగతా సహచరులందరికీ అభినందనలు' అని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ట్వీట్ చేశారు.