2015 నాటికి 55 మిలియన్ ఉద్యోగాలు అవసరం

మొత్తంలో జనాభాలో ఇప్పుడున్న 39 శాతం ఉపాధి రేటును కొనసాగించాలంటే 2015 నాటికి భారత్‌కు అదనంగా 55 మిలియన్ల ఉద్యోగాలు అవసరమని క్రిసిల్ అనే పరిశోధన సంస్థ అభిప్రాయపడింది.

'భారత్‌లో ఉపాధి: ఎగుడుదిగుడు-బలహీనం' అనే పేరుతో క్రిసిల్ తయారు చేసిన నివేదికలో ఉపాధి కల్పన రేటును రెండింతలు చేయాలని సూచించింది. 2000-05లో 27.2 మిలియన్ ఉద్యోగాలు సృష్టించగా 2005-10 కాలంలో 27.7 మిలియన్ల ఉద్యోగాల కల్పన జరిగింది.

"జీడీపీ వృద్ధికి అనుగుణంగా ఉద్యోగాల కల్పన జరుగలేదు. జీడీపీ వృద్ధి 2000-05లో నమోదైన ఆరు శాతం నుంచి 2005-10 కాలానికి 8.6 శాతానికి పెరిగింది. అయితే ఉద్యోగాల కల్పన ఈ స్థాయిలో జరుగలేదని" క్రిస్ ముఖ్య ఆర్థికవేత్త డీకే జోషి చెప్పారు. 2005-10 కాలంలో స్వయం ఉపాధి పొందే వారి సంఖ్య తగ్గిపోవడంతో ఉపాధి కల్పన కూడా క్షీణించిందని జోషి అభిప్రాయపడ్డారు.

ఉపాధిపై నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ సమాచారం ఆధారంగా చేపట్టిన ఈ అధ్యయనం సరైన విధానం లేకుండా 55 మిలియన్ ఉద్యోగాల కల్పన కష్టసాధ్యమని వెల్లడించింది. ప్రోత్సాహక వాతావరణంలేని కారణంగా అధిక ఉపాధిని కల్పించే సామర్థ్యం కలిగిన తయారీ, సేవా రంగాలు పూర్తి స్థాయిలో ఉద్యోగాలు కల్పించలేకపోతున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

వెబ్దునియా పై చదవండి