బాల మేధావులు అరుదుగా వుంటుంటారు. చిన్నప్పట్నుంచే ఆమెకి సరస్వతి కటాక్షం లభించిందో ఏమోగానీ చిన్నప్పటి నుంచీ చదువుల్లో రికార్డులు సృష్టించిన కాశీభట్ట సంహిత కేవలం 17 ఏళ్ళకే CAT(కామన్ అడ్మిషన్ టెస్ట్) 2018లో 95.95 స్కోర్ సాధించి రికార్డు సృష్టించింది. ఈ ఫీట్ సాధించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డులకెక్కింది.
మరో విశేషం ఏమిటంటే... 16 సంవత్సరాలకే ఇంజినీరింగ్ పూర్తి చేసిన మొదటి భారతీయురాలిగా కూడా ఆమె చరిత్ర సృష్టించింది. ఈమె మేధస్సును ఆమెకు మూడేళ్ల వయసులోనే గుర్తించారు. ఆ చిరుప్రాయంలో ఏకంగా ఆమె ప్రపంచంలోని దేశాలు, వాటి రాజధానులు, దేశాల జెండాలను గుర్తించి చెప్పేసేది. సంహిత మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుందాం.