ఆన్‌లైన్‌కు బై బై... ఆఫ్‌లైన్‌‌కు హాయ్‌ హాయ్‌...

ఆదివారం, 27 ఫిబ్రవరి 2022 (23:16 IST)
కరోనా డిజిటల్‌ ఆర్ధిక వ్యవస్థను విస్తృతం చేయడం మాత్రమే కాదు విద్యావ్యవస్ధలోనూ చాలా మార్పులను తీసుకువచ్చింది. విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆకట్టుకోవడానికి నేలవిడిచి సాముచేస్తోన్న ఎడ్‌టెక్‌ సంస్థలకు కుప్పలుతెప్పలుగా అవకాశాలను తీసుకురావడంతో పాటుగా పాఠశాలలు కూడా తప్పనిసరిగా డిజిటల్‌ విద్యవైపు దృష్టి సారించాల్సిన ఆవశ్యకతను మహమ్మారి తీసుకువచ్చింది. కానీ ఏం లాభం, పిల్లలకు పాఠాలు అర్థం కావడం లేదు, క్లాస్‌లు వినకుండా ఇతర పనులు చేస్తున్నారనే ఆరోపణలు ఆన్‌లైన్‌ అభ్యాస కాలంలో  వింటూనే వచ్చాం.

 
మూడోవేవ్‌ కూడా ముగింపుకు రావడంతో ఆలస్యంగానే అయినా పూర్తి స్ధాయిలో విద్యాలయాలు ప్రారంభమయ్యాయి. నిన్నమొన్నటి వరకూ ఆన్‌లైన్‌ విద్యకు అలవాటు పడిన విద్యార్ధులు ట్యాబ్‌లను పక్కన పెట్టి బ్యాగ్‌లను తగించాల్సిన స్థితి. పరీక్షలు కూడా దగ్గర పడుతుండటంతో సిలబస్‌ పూర్తి చేసే పనిలో పడ్డాయి విద్యాలయాలు. కానీ ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌ విద్యకు విద్యార్ధులు తమను తాము మార్చుకోవడం సలభమేనా? ఓ పద్ధతికి అలవాటు పడిన విద్యార్థులు అకస్మాత్తుగా ఆ పద్ధతి వదిలి ఇంకో విధానానికి అలవాటు పడటం కాస్త కష్టసాధ్యమేనంటున్నారు ఎక్స్‌లెన్సియా ఇనిస్టిట్యూషన్స్‌ ఫౌండర్- డైరెక్టర్‌ వెంకట్‌ మురికి. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మార్పును ఎలా స్వీకరించవచ్చనే విషయమై ఆయన చెబుతున్న అంశాలేమిటంటే...

 
ఓ క్రమపద్ధతి పాటించాలి
ఆన్‌లైన్‌ విద్యావిధానం కారణంగా విద్యార్థుల రోజువారీ పద్ధతులు సమూలంగా మారాయి. స్కూల్స్‌ నడిచిన కాలంలో ఉదయమే నిద్ర లేవడం, సమయానికి స్కూల్‌లో ఉండటం జరిగేది. ఆన్‌లైన్‌లో ఇవేవీ లేవు. క్లాస్‌ టైమ్‌కు ఓ నిమిషం ముందు లేవడం, ఆ నిద్ర మొహంతోనే ట్యాబ్‌ ముందేసుకుని కూర్చోవడం, క్లాస్‌ జరుగుతుంటే తినడం... ఎన్నెన్ని సిత్రాలో!  ఆఫ్‌లైన్‌ తరగతులు పునః ప్రారంభం కావడం వల్ల విద్యార్ధులు ఓ క్రమశిక్షణ అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది. అకస్మాత్తుగా మారడం కష్టమే కానీ అసాధ్యమైతే కాదు.

క్లాస్‌లకు క్రమం తప్పకుండా హాజరుకావాలి..
ఆన్‌లైన్‌ క్లాస్‌లు పిల్లలను బద్దకస్తుగా మార్చాయి. కష్టమనుకున్నప్పుడు నెట్‌వర్క్‌ సమస్య చెప్పి తప్పించుకున్న వారూ ఉన్నారు. ఆఫ్‌లైన్‌ క్లాస్‌లలో అవి వర్కవుట్‌ కావుగా! అందువల్ల విద్యార్ధులు క్రమం తప్పకుండా క్లాస్‌లకు హాజరుకావడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. దానితో పాటుగా ఏ రోజు చెప్పింది ఆ రోజు మననం చేయడం వల్ల వారు త్వరగా క్లాస్‌లో చురుగ్గామారే అవకాశాలూ ఉన్నాయి.

 
శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా కూడా...
ఆన్‌లైన్‌ క్లాస్‌లో స్ర్కీన్‌ముందు కూర్చుంటారు కాబట్టి ఆ స్ర్కీన్‌పై కనబడేది మాత్రమే అనుసరించడం  జరిగేది. ఆఫ్‌లైన్‌లో అది మారుతుంది. తోటి విద్యార్థులతో సంభాషణలు కూడా ఉండటం వల్ల వారు ఏం చదువుతున్నారు, సిలబస్‌ ఏమిటి అనే అంశాలను తెలుసుకోవచ్చు. అందుకే శారీరకంగా మాత్రమే కాక మానసికంగా వారు క్లాస్‌లో ఉండాలి..

 
ఉత్సాహం కూడదు...
చాలాకాలం తరువాత తమ స్నేహితులను కలుసుకుంటున్న ఉత్సాహంలో విద్యార్థులు హగ్గులు, చేతులు కలపడం చేస్తుంటారు. మహమ్మారి ఇంకా ముగియలేదని గమనించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుని తమ స్నేహితులను సంభాషించడం మంచిది.

 
టీచర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే...
ఆన్‌లైన్‌ నుంచి ఆఫ్‌లైన్‌కు విద్యార్థులు మారుతున్న వేళ సామాజిక-భావోద్వేగ సవాళ్లు ఎదురుకావడం జరుగవచ్చు. మార్పును స్వీకరించడం కూడా  కొంతమందికి కష్టం కావొచ్చు. అలాంటి వారిని గురించివారిలో భయాందోళనలు తగ్గించే ప్రయత్నం టీచర్లు చేయాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు