"కవర్ లెటర్" ఆసక్తిదాయకంగా ఉండాలంటే...!

శుక్రవారం, 10 అక్టోబరు 2008 (13:13 IST)
FileFILE
ఏదేనీ వెబ్‌సైట్‌లోనో, పత్రికల్లోనో ఉద్యోగ ప్రకటనలు కనిపించగానే నిరుద్యోగులు వెంటనే తమ తమ రెజ్యూమ్‌లను ఆయా కంపెనీలకు పంపించేస్తుండటం సహజం. ఫలానా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటున్నాను, రెజ్యూమ్‌ను జతపరుస్తున్నాను, పరిశీలగరంటూ ముగిస్తుంటారు.

అయితే అంతటితోనే సరిపెట్టేయకుండా రెజ్యూమ్‌తోపాటు కవర్ లెటర్‌ (అభ్యర్థనా పత్రం)ను కూడా తప్పనిసరిగా పంపించాల్సి ఉంటుంది. ఆ కంపెనీకి, మీకు మధ్య తొలి అనుసంధానం అభ్యర్థనా పత్రమే కాబట్టి, అది ప్రభావశీలంగా ఉండాలి. ముఖ్యంగా ఈ మెయిల్ ద్వారా రెజ్యూమ్స్ పంపించేటప్పుడు మొదటగా చదివేది కవర్ లెటర్‌నే. కాబట్టి ఈ లెటర్ ఆసక్తిదాయకంగా ఉంటేనే రెజ్యూమ్ పరిశీలించేందుకు ఎవరైనా ఆసక్తి చూపిస్తారు.
ఇలాంటివి చేయవద్దు..!
  సాధారణంగా... డియర్ సర్ లేదా డియర్ మేడమ్ అని సంభోదిస్తూ మొదలు పెట్టడం ప్రతి ఒక్కరూ చేసే పొరపాటు. ఎవరికి దరఖాస్తు చేస్తున్నదీ, ఎవరికి ఉత్తరం రాస్తున్నదీ తెలుసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థిదే కాబట్టి, ఈ అవగాహన అభ్యర్థికి ఉన్నదీ లేనిదీ కూడా గమనిస్తారు...      


మరి ఈ అభ్యర్థనా పత్రం ప్రభావశీలంగా రాయాలంటే కింద చెప్పబోయే జాగ్రత్తలను పాటించడం మంచిది.

ముందుగా ఆ సంస్థ గురించి కూలంకషంగా తెలుసుకోవాలి. సంస్థ వ్యాపార స్వభావం, అందులో మీరు దరఖాస్తు చేయబోయే ఉద్యోగ స్వభావం లాంటి విషయాలను కూడా తెలుసుకుని ఉండాలి. ఆ ఉద్యోగం మీకున్న అవగాహనను, దానికి మీరే ఎందుకు సమర్థులన్న విషయాన్ని కవర్ లెటర్‌లో ప్రతిబింబించాలి.

ముఖ్యంగా ఈ కవర్ లెటర్ మీ స్నేహితులకో, సన్నిహితులకో రాసే ఉత్తరం లాంటిది కాదు కాబట్టి, విషయాన్ని సూటిగా, స్పష్టంగా రాయాలి. ఉపోద్ఘాతం రాస్తే విసుగు తెప్పిస్తుంది. విషయాన్ని సరాసరి ప్రస్తావిస్తూ... ఏ ఉద్యోగానికి దరఖాస్తు చేస్తున్నదీ పేర్కోవాలి.

సాధారణంగా... డియర్ సర్ లేదా డియర్ మేడమ్ అని సంభోదిస్తూ మొదలు పెట్టడం ప్రతి ఒక్కరూ చేసే పొరపాటు. ఎవరికి దరఖాస్తు చేస్తున్నదీ, ఎవరికి ఉత్తరం రాస్తున్నదీ తెలుసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థిదే కాబట్టి, ఈ అవగాహన అభ్యర్థికి ఉన్నదీ లేనిదీ కూడా గమనిస్తారు. అందుకనే... మీరు దరఖాస్తు చేయబోయే వ్యక్తి, హోదా, పేరు తెలుసుకుని సంభోదిస్తే మంచిది.

ఇకపోతే... అన్ని కంపెనీలతో పాటు ఈ కంపెనీకి కూడా దరఖాస్తు చేస్తున్నారని అనిపించేలా ఉండకూడదు. ఈ కంపెనీలో పనిచేసేందుకు చాలా ఆసక్తితో ఉన్నానన్న సందేశం ఆ లెటర్లో కనిపించాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా ఎవరి పేరూ పేర్కొనే అవకాశం ఉండదు కాబట్టి అక్కడ డియర్ సర్, డియర్ మేడమ్ అని కానీ... టు ద డిపార్ట్‌మెంట్.. అనిగానీ సంబోధించవచ్చు.

రెజ్యూమ్‌లో పేర్కొన్న విషయాలు అభ్యర్థనా పత్రంలో పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. మీ గత అనుభవాలు, నైపుణ్యాలు ఈ ఉద్యోగానికి ఏ విధంగా సరిపోతాయో, ఏ విధంగా న్యాయం చేయగలరో వివరించాలి. అక్షర దోషాలు, వ్యాకరణ దోషాల్లాంటివి ఏమాత్రం ఉండకూడదు.

ఇక చివరిగా... ఈమెయిల్‌లో అభ్యర్థనా పత్రం పంపించేటట్లయితే ఫాంట్ ఎంపికలో జాగ్రత్త అవసరం. ఏరియల్ లేదా టైమ్స్ రోమన్ ఫాంట్‌లను వాడితే మంచిది. అనవసరంగా కాపిటల్ లెటర్స్‌ను వాడకూడదు. అలాగే, అవసరమైనచోట బుల్లెట్ పాయింట్లు వాడటం వల్ల చదివేందుకు అనుకూలంగా ఉంటాయి. అక్షరాలు నలుపురంగులోనే ఉంచాలి. అనవసరమైన రంగులు, బొమ్మలు, చిత్రాలు లాంటివి వాడకుండా జాగ్రత్తపడాలి.

పైన చెప్పిన విషయాలను మీరు గమనించి, కవర్‌లెటర్‌ను ఆసక్తిదాయకంగా తయారుచేసి దరఖాస్తులకు జతచేసి పంపించారంటే... ఆయా ఉద్యోగాలను పొందడానికి ఎక్కువ అవకాశాలను కలిగి ఉంటారు.

వెబ్దునియా పై చదవండి