'కొత్త టెక్నాలజీ'తో 'పరీక్షల్లో మోసాలు' ఇకపై కష్టమే

పరీక్షల సమయంలో వివిధ రకాల మోసాలకు పాల్పడే విద్యార్థలకు ఇకపై గడ్డురోజులు రానున్నాయి. ఒకరి బదులు వేరొకరు పరీక్ష రాయడం, మాస్ కాపీయింగ్ లాంటి మోసాలకు పాల్పడే వారిని పట్టిచ్చే కొత్త టెక్నాలజీ త్వరలో అందుబాటులో రానుంది.

కాన్పూర్ ఐఐటీకి చెందిన కంప్యూటర్ సైన్స్ విభాగం ప్రొఫెసర్ ఫాల్గుణి గుప్తా ఈ సరికొత్త టెక్నాలజీని రూపొందించారు. ఈ కొత్తరకం టెక్నాలజీ ద్వారా హాల్‌టికెట్ జారీ సమయంలోనే విద్యార్థికి సంబంధించిన వివరాలతో పాటు అతని కనుపాప, వేలిముద్రలు, సంతకాలు తదితర అంశాలను కంప్యూటర్‌కు అందిస్తారు.

దీంతో కంప్యూటర్‌లో పొందుపరిచిన అంశాలతో పరీక్షా సమయంలో విద్యార్ధి వివరాలను సరిపోల్చడం చాలా సులభమవుతుంది. తద్వారా పరీక్షల్లో ఎవరైనా మోసానికి పాల్పడితే ఇట్టే దొరికిపోతారు.

ఈ సరికొత్త టెక్నాలజీ గురించి ప్రొఫెసర్ ఫాల్గుణి మాట్లాడుతూ తాను కనుగొన్న టెక్నాలజీని విజయవంతంగా పరీక్షించి చూశామని తెలిపారు. ఈ టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా ప్రవేశపరీక్షలతో పాటు సాధారణ పరీక్షల్లో సైతం మోసాలకు పాల్పడేవారిని సులభంగా గుర్తించవచ్చని ఆయన పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి