దేశ విదేశాలలో నేరాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. నేరాలు చేసేవారిని వెతికి పట్టుకునేందుకు అనువైన రంగం క్రిమినాలజీ రంగం. ఇందులో మీరు కెరీర్‌ను ప్రారంభిస్తే మంచి జీతంతోపాటు సకల సదుపాయాలు ఉంటాయి. దీనికి కావలసింది మీకు పరిశోధనా జ్ఞానం ఉండాలి. మీలో కొత్త కొత్త విషయాలపట్ల శోధించే గుణం ఉండాలి. ఇలాగైతే మీరు క్రిమినాలజీ కెరియర్‌ను ఆప్షన్‌గా ఎంచుకోండి.
కార్యరంగం :
క్రిమినాలజిస్ట్ చేయాల్సి పని ఏంటంటే ఏదైనా ఘోరం లేక నేరం జరిగినప్పుడు ఆయా ప్రాంతాలలో సాక్ష్యాలు పొందేందుకు పలు రకాలుగా శోధించాలి. నేరాలు జరిగిన ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉందో వాటిని మీ పై అధికారులకు అందజేయాలి. నేరం గురించి పూర్తి పరిశోధన చేయాల్సి వుంటుంది. నేరానికి సంబంధించిన కారణాలను వెతకాల్సివుంటుంది. నిందితుడు నేరాలను ఏ కోణంలో చేసాడు, ఎలాంటి సందర్భంలో చేయాల్సి వచ్చిందనేది మీరు గుర్తించాల్సివుంటుంది.
ప్రస్తుతం ఇలాంటి కెరియర్ ఎంచుకున్నవాళ్ళు చాలా వేగంగా అభివృద్ధి చెందడంతోపాటు క్రిమినాలజిస్ట్‌లు సమాజాన్ని అపరాధం, నేరాల నుంచి కాపాడగలుగుతారనడంలో సందేహం లేదు.
కోర్స్ :
క్రిమినాలజీని మీరు కెరియర్‌గా ఎంచుకోవాలనుకుంటే బిఎ లేక బిఎస్సీ డిగ్రీ కోర్సుల్లో క్రిమినాలజీ కోర్సును ఆప్షన్‌గా ఎంచుకోవాల్సి వుంటుంది. క్రిమినాలజీ కోర్స్ కాల వ్యవధి మూడు సంవత్సరాలు. దీని కోసం ఇంటర్మీడియెట్ కోర్సులో ఆర్ట్స్ లేదా సైన్స్ గ్రూప్ తీసుకున్న వారు అర్హులు. అలాగే డిగ్రీ, పీజీ కోర్సు చేసిన వారు కూడా ఈ కోర్సు చేసేందుకు అర్హులు.
వ్యక్తిగత గుణాలు :
** న్యాయ వ్యవస్థపై ఆసక్తి, చట్టాలను తెలుసుకోవాలనే తపన కలిగివుండాలి.
** తర్కం, వ్యావహారిక పరిజ్ఞానం కలిగివుండాలి.
** వ్యక్తిగతంగానే కాకుండా మీ తోటి బృందంతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంటుంది.
** అనేక రకాల సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి.
** దూరదృష్టి కలిగి ఉండాలి. ప్రతి విషయంపై అవగాహన కలిగివుండాలి.
అవకాశాలు ఎక్కడ ఉన్నాయి :
క్రిమినాలజిస్ట్‌లు ప్రభుత్వం, ప్రభుత్వేతర కంపెనీలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్, స్వచ్ఛంద సంస్థలు, రీసెర్చ్ ఆర్గనైజేషన్, ప్రైవేట్ సెక్యూరిటీ, డిటెక్టివ్ ఏజెన్సీలలో ఉద్యోగావకాశాలు మెండుగా ఉన్నాయి. వీటితోపాటు క్రిమినాలజిస్ట్ కౌన్సిలర్, ఫ్రీలాన్సర్‌లుగా కూడా వ్యవహరించవచ్చు.
క్రిమినాలజిస్ట్ కోర్స్‌ను పూర్తి చేసిన తర్వాత క్రైమ్ ఇంటెలిజెన్స్, లా రిఫార్మ్ రీసెర్చ్, కమ్యూనిటీ కరెక్షన్ కో-ఆర్డినేటర్, డ్రగ్ పాలసీ అడ్వైజర్, కంజ్యూమర్ అడ్వొకేట్, ఎన్విరాన్‌మెంట్ ప్రొటెక్షన్ ఎనాలిస్ట్ పదవులను కూడా పొందే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
విశేషజ్ఞులు ఏమంటున్నారంటే :
ప్రస్తుతం కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రంపంచం ముందుకు దూసుకు పోతోంది. అదే విధంగా క్రైమ్ (నేరాలు) సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకు పెరుగుతున్న నేరాల కారణంగా రానున్న రోజుల్లో అంటే 2014 నాటికి ఈ రంగంలో మరింత మంది నిపుణులు సమాజానికి చాలా అవసరం అంటున్నారు విశేషజ్ఞులు
ఆదాయం :
క్రిమినాలజిస్ట్‌గా కెరియర్ ఎంచుకున్న వారికి ప్రారంభంలో దాదాపు 10 నుంచి 15 వేల రూపాయలను ప్రతి నెల సంపాదించుకోవచ్చు. అనుభవం ప్రాతిపదికన 20 నుంచి 25 వేల రూపాయలను సులభంగా సంపాదించుకోవచ్చు. ఇది కాకుండా ఫ్రీలాన్సర్‌లాగా కేసుననుసరించి మీరు ఫీజును వసూలు చేయవచ్చు. ఒకవేళ మీరు విదేశాలలో ఉద్యోగాలు చేయాలనుకుంటే అక్కడ మెరుగైన జీతాలను అందుకోవచ్చు.
క్రిమినాలజిస్ట్ కోర్సలను అందిస్తున్న విశ్వవిద్యాలయాలు :
** ఆంధ్రా విశ్వవిద్యాలయం, విశాఖపట్నం.
** లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్.
** పట్నా విశ్వవిద్యాలయం, బీహార్.
** పంజాబ్ విశ్వవిద్యాలయం, చండీగఢ్.
** యూనివర్శిటీ ఆఫ్ మద్రాస్, చెన్నై.
** యూనివర్శిటీ ఆఫ్ లక్నో.
** యూనివర్శిటీ ఆఫ్ జమ్మూ, జమ్మూ అండ్ కాశ్మీర్.
** నేషనల్ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్, ఢిల్లీ.