14,061 పోస్టులకు నోటిఫికేషన్.. మార్చి చివరి వారంలో రాత పరీక్ష
శుక్రవారం, 14 ఫిబ్రవరి 2020 (15:24 IST)
ఆంధ్రప్రదేశ్ సర్కారు ఓ శుభవార్త చెప్పింది. గతంలోనే గ్రామ, వార్డు సచివాలయానికి చెందిన 14,061 పోస్టులకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గడువు తేదీ ముగిసే సమయానికి సుమారు 11,06,614 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇప్పటికే 14 వేల ఖాళీలకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసిన ప్రభుత్వం తాజాగా ఆ పోస్టులను భర్తీ చేసేందుకు మార్చి చివరి వారంలో రాత పరీక్షను నిర్వహించనుంది. ఇక ఫలితాల్లోని మెరిట్ లిస్ట్ ఆధారంగా జిల్లా ఎంపిక కమిటీకి బాధ్యతలను అప్పగించాలని చూస్తున్నారు.
దీనికి సంబంధించిన పూర్తి బాధ్యతలను ఏపీపీఎస్సీ బోర్డుకు అప్పగించింది. ప్రశ్నాపత్రం రూపొందించే దగ్గర నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం వరకు అన్ని కూడా బోర్డు పర్యవేక్షణలోనే జరగనున్నాయి.
ఇదిలా ఉంటే రాత పరీక్షను 3-4 రోజులు నిర్వహించి.. ఆ తర్వాత వారం రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని నిర్ణయానికి వచ్చారు. ఆ తర్వాత వారం రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వం నిర్ణయించింది.