టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. ప్రపంచ కప్ సెమీఫైనల్‌లో రాణించలేకపోయిన ధోనీ.. ఆపై అంతర్జాతీయ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. తాజాగా ఆసియా ఎలెవన్ జట్టులో ధోనీకి స్థానం లభించింది. ఆసియా ఎలెవన్ జట్టులో పాల్గొనడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు బీసీసీఐ నుంచి అనుమతి కోరింది. అయితే బీసీసీఐ ఆమోదం తెలపాల్సి ఉంది.
ఆసియా ఎలెవన్ జట్టులో ఆడితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 13వ ఎడిషన్ కంటే ముందే ధోనీ అంతర్జాతీయ క్రికెట్ ఆడనున్నాడు. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఎలెవన్, ఆసియా ఎలెవన్ జట్ల మధ్య రెండు టీ20 మ్యాచ్‌లు మార్చి 18, 21 తేదీలలో జరగనున్నాయి. ఈ రెండు రెండు టీ20లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మ్యాచ్‌ల హోదాను పొందాయి. ఆసియా ఎలెవన్ జట్టులో ధోనీ ఆడునున్నట్టు బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిజాముద్దీన్ చౌదరి తెలిపారు.