దేశం కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో మరో పరీక్ష వాయిదా పడింది. ఇప్పటికే పలు జాతీయస్థాయి ఎంట్రెన్స్‌లు వాయిదాపడ్డాయి. తాజాగా జేఈఈ మెయిన్ కూడా ఈ జాబితాలో చేరింది. ఐఐటీ, ఎన్ఐటీల్లో బీటెక్ లేదా బీఈ అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్ ఏప్రిల్ సెషన్‌ను వాయిదా వేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది.
అయితే, మళ్లీ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాన్ని ఎగ్జామ్ తేదీకి కనీసం 15 రోజుల ముందు ప్రకటిస్తామని వెల్లడించింది. షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్ పరీక్ష ఈనెల 27, 28, 30 తేదీల్లో జరగాల్సి ఉన్నది. ఇప్పటికే మొదటి రెండు సెషన్లు ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తయ్యాయి. మూడోదైన ఏప్రిల్ సెషన్ కరోనాతో వాయిదాపడింది.
కరోనా నేపథ్యంలో ఇప్పటికే సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు రద్దయిన విషయం తెలిసిందే. అదేవిధంగా సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలు వాయిదాపడ్డాయి. దీంతో జేఈఈ మెయిన్‌ను కూడా పోస్ట్‌పోన్ చేయాలని విద్యార్థులు కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా పరీక్షను వాయిదావేస్తూ ఎన్‌టీఏ నిర్ణయం తీసుకున్నది.