కరోనా వైరస్ మహమ్మారి కారణంగా దేశంలో అనేక రకాలైన వార్షిక పరీక్షలు వాయిదాపడ్డాయి. ఈ పరీక్షలను నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. పైగా, పలు రాష్ట్రాల్లో 10, 12వ తరగతి పరీక్షలను కూడా రద్దు చేశారు. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా డిగ్రీ, పిజీ పరీక్షలకు సంబంధించి నెలకొన్న సందిగ్ధతకు కేంద్రం తెరదించింది.
అన్‌లాక్-2 సమయంలో ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించుకునేందుకు యూనివర్సిటీలకు, విద్యా సంస్థలకు అనుమతిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ సోమవారం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ఉన్నత విద్యా శాఖ సెక్రటరీకి కేంద్ర హోం శాఖ లేఖ రాసింది. ఫైనల్ టెర్మ్ ఎగ్జామ్స్ తప్పనిసరిగా నిర్వహించాలని.. అయితే యూజీసీ మార్గదర్శకాలకు లోబడి, నిబంధనలను పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని సూచించింది.
ఇప్పటికే పలు రాష్ట్రాలు డిగ్రీ, పీజీ పరీక్షలను రద్దు చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయాన్ని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. యూజీసీ తాజా మార్గదర్శకాల కోసం ఇప్పటివరకూ ఎదురుచూసిన పలు రాష్ట్రాలకు తాజా ప్రకటనతో పరీక్షల నిర్వహణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది.