టీసీఎస్ రూరల్ ఐటీ క్విజ్: కృష్ణాజిల్లాలోని కొమ్మారెడ్డి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి విజేత
బుధవారం, 3 నవంబరు 2021 (19:24 IST)
సుప్రసిద్ధ అంతర్జాతీయ ఐటీ సేవలు, కన్సల్టింగ్, వ్యాపార పరిష్కారాల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నిర్వహించిన రూరల్ ఐటీ క్విజ్-2021 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనల్స్‌లో కృష్ణా జిల్లాలోని కొమ్మారెడ్డి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థి విజేతగా నిలిచాడని వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యా శాఖ మరియు కర్నాటక రాష్ట్ర ఐటీ, బీటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల సహకారంతో టీసీఎస్ ఈ 22 వ ఎడిషన్ క్విజ్‌ను నిర్వహించింది. ఈ సంవత్సరం ఈ క్విజ్‌లో వర్ట్యువల్ విధానంలో పాల్గొనే అవకాశం కల్పించారు. ఆన్లైన్లో పరీక్షలకు వారు హాజరుకావడంతో పాటుగా వర్ట్యువల్గానే క్విజ్‌లో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు పాఠశాలలకు చెందిన 8-12వ తరగతి విద్యార్థులు పాల్గొన్న ఈ క్విజ్‌లో ప్రాధమిక ఆన్లైన్ టెస్ట్ తరువాత ఆరుగురు విద్యార్థులను వర్ట్యువల్ ఫైనల్స్‌కు ఎంపిక చేశారు. ఈ ఫైనల్స్ ఐదు విభాగాలు- బైట్ క్లౌడ్స్, బైట్ రికగ్నైజేషన్, బైట్ కంటెక్ట్స్, బోర్డర్‌లెస్ బైట్స్, బైట్స్ ఏజిల్గా నిర్వహించారు. తద్వారా వారి ఐటీ పరిజ్ఞానం పరీక్షించారు.
రూరల్ ఐటీ క్విజ్, ఆంధ్రప్రదేశ్ విజేతలు...
విజేత- గణేష్ భరద్వాజ్, కొమ్మారెడ్డి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, కృష్ణా జిల్లా.
ద్వితీయ స్ధానం- పట్నాల హరితేజ, ఏపీ మోడల్ స్కూల్, తమడ.
విజేతకు 10వేల రూపాయల విలువ కలిగిన బహుమతులు,ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి 7వేల రూపాయల విలువ కలిగిన వోచర్లు అందించారు.
రూరల్ ఐటీ క్విజ్‌ను 2000 సంవత్సరం నుంచి టీసీఎస్ నిర్వహిస్తుంది. ఈ సంవత్సరం నిర్వహించిన క్విజ్‌ను ఎనిమిది రాష్ట్రాలు- గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, మధ్య ప్రదేశ్, రాజస్తాన్, ఉత్తర్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కర్నాటకలలో నిర్వహించారు. ఈ రాష్ట్రాల విజేతలు నవంబర్లోనే నిర్వహించే జాతీయ స్థాయి ఫైనల్స్‌లో పోటీపడతారు. జాతీయ స్థాయి విజేతలకు ఒక లక్ష రూపాయల విలువ కలిగిన స్కాలర్షిప్ను అందజేస్తారు.