పుట్టిన తేదీ: నవంబర్ 27, 1986. అదృష్ట సంఖ్యలు: 3, 7, 9 భారత క్రికెట్ జట్టులో తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సాధించిన ఆటగాడిగా సురేష్ రైనాను పేర్కొనవచ్చు. ప్రస్తుతానికి వన్డే జట్టులో మాత్రమే స్థానం సంపాదించినా భవిష్యత్‌లో టెస్టు జట్టులోనూ స్థానం సాధించగల అవకాశాలు పుష్కలంగా ఉన్న యువ ఆటగాళ్లలో రైనా ముందు వరుసలో ఉండడం విశేషం.
ఇప్పటివరకు 60 అంతర్జాతీయ వన్డేలాడిన రైనా రెండు సెంచరీలు, తొమ్మిది అర్థ సెంచరీలతో సహా 1400 పైచిలుకు పరుగులు సాధించడం విశేషం. తాజాగా శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడిన రైనా కొద్దిరోజుల్లో న్యూజిలాండ్ జట్టుతో సిరీస్ ఆడేందుకు ఎంపికైన జట్టులో చోటు సాధించాడు.
టీం ఇండియా కెప్టెన్ ధోనీకి ఇష్టమైన ఆటగాళ్ల జాబితాలో కొనసాగుతున్న రైనా వ్యక్తిగతాన్ని ఓసారి పరిశీలిస్తే ఎన్నో విశిష్టతలు కన్పిస్తాయి. ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నవంబర్ 27, 1986లో రైనా జన్మించాడు. సురేష్ కుమార్ రైనా అనే పూర్తి కలిగిన రైనా చిన్ననాటినుంచే క్రికెట్ మీద ఉన్న ఆసక్తితో దానినే తన కెరీర్‌గా ఎంచుకున్నాడు.
శ్రీలంకతో 2005లో జరిగిన వన్డేలో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన రైనా దాదాపు ఈ ఐదేళ్లలో 60 మ్యాచుల్లో ఆడాడు. ప్రతిసారీ భారీ స్కోరు సాధించకున్నా ప్రతి మ్యాచ్‌లోనూ తన అస్థిత్వం నిలబెట్టుకునే విధంగానే ఆడడం విశేషం. అయితే ఈ ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్ క్రీజులో ఓసారి కుదురుకుంటే ఇక బౌలర్లపై ఎదురుదాడికి దిగడం గమనార్హం.
అలాగే నాలుగేళ్లుగా అంతర్జాతీయ కెరీర్ కొనసాగిస్తున్నా ఎలాంటి వివాదాల జోలికీ పోకుండా తన ఆటగురించి మాత్రమే ఆలోచించడం ప్రత్యేకత. జట్టులో విపరీతమైన పోటీ ఉన్న సమయంలోనూ తన ప్రత్యేకత నిరపించుకునేలా ఆడడం కూడా రైనా ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. రైనాలో కన్పించే ఈ లక్షణాలు అతని జన్మదిన రాశి అయిన ధనస్సురాశిలోని వారిలో కూడా కన్పిస్తాయి.
ఈ రాశిలో జన్మించివారు మరీ గొప్ప పేరు తెచ్చుకోకపోయినా తమ కెరీర్‌కు సంబంధించి మంచి స్థితిలోనే కొనసాగుతుంటారు. అలాగే చేసే పనిలో తమకంటూ ఓ ప్రత్యేకత ఏర్పరుచుకునేందుకు వీరు నిత్యం శ్రమిస్తుంటారు. అయితే వీరి శ్రమకు తగ్గ ఫలితం లభించడానికి మాత్రం కాస్త సమయం పడుతుంటుంది. అదేసమయంలో వీరి శ్రమ వృధా పోవడం మాత్రం జరగదు.