పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్

పుట్టినతేది: సెప్టెంబర్ 2, 1973
అదృష్ట సంఖ్యలు: 3, 6, 9
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్న అతి కొద్దిమంది నటుల్లో పవన్‌కళ్యాణ్ ఒకరు. మెగాస్టార్ చిరంజీవి సోదరుడిగా సినీరంగ ప్రవేశం చేసినా ఆ తర్వాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుని అగ్ర కథానాయకుల స్థానానికి చేరడం పవన్‌కళ్యాణ్ ప్రత్యేకత.

అక్కడ అమ్మయి ఇక్కడ అబ్బాయి చిత్రంతో వెండితెరకు పరిచయమైన పవన్‌కళ్యాణ్ ఆనాటి నుంచి నేటివరకు నటించిన చిత్రాల్లో చాలా వరకు ఘనవిజయం సాధించిన చిత్రాలే ఉండడం గమనార్హం. ప్రత్యేకమైన మేనరింజంలతో యువతను బహు చక్కగా ఆకట్టుకున్న పవన్‌కళ్యాణ్ తొలిప్రేమ, బద్రి, ఖుషీ, జల్సా చిత్రాలతో వారికి మరింత చేరువయ్యారు. సెప్టెంబర్ 2, 1973లో జన్మించిన పవన్‌కళ్యాణ్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టేవరకు పెద్దగా ఎవరికీ పరిచయం ఉండకపోవడం విశేషం.

అలాగే సినీ పరిశ్రమలో మెగాస్టార్‌గా పేరు తెచ్చుకున్న చిరంజీవికి తమ్ముడైనా కేవలం ఆ పేరుతోనే గొప్పవాడై పోవాలని అనుకోలేదు. తన నటనా ప్రావీణ్యంతో తనకు మాత్రమే చేతనైన ప్రత్యేకమైన మేనరిజంతో ప్రేక్షకులను ఆకట్టుకోవడం పవన్ ప్రత్యేకత. ప్రస్తుతం తన సోదరుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ యువరాజ్యం అధ్యక్షుడుగా చురుకైన బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్‌కళ్యాణ్ అందుకోసం తన సినిమా జీవితాన్ని కూడా కొద్దిరోజులుగా పక్కన పెట్టారు.

ఇలాంటి పవన్‌కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని ఓసారి పరిశీలిస్తే... ఆవేశంతోపాటు మంచితనం కలగలసిన ఓ మహోన్నత వ్యక్తిత్వం మనకు కనిపిస్తుంది. నమ్మిన సిద్ధాంతం కోసం నిరంతరం ప్రయత్నించే పట్టుదల కనిపిస్తుంది. అలాగే వ్యక్తిగా సరదాగా కన్పించినా ఆలోచనల్లో మాత్రం మేరు పర్వతంలాగా ఉండడం కూడా పవన్ ప్రత్యేకత. వ్యక్తిగత జీవితంలో కొద్దిపాటి లోటుపాట్లు ఉన్నా నలుగురికీ సాయం చేయాలనే తపన పవన్‌లో మెండుగా కన్పిస్తుంది.

అందుకే పేదల గురించి, వారి కష్టాల గురించి మాట్లాడే సమయంలో పవన్‌లో ఆవేశం కొట్టొచ్చినట్టు కన్పిస్తుంటుంది. పవన్‌లో కన్పించే ఈ లక్షణాలు ఆయన పుట్టినతేదీకి సంబంధించిన రాశి అయిన కన్యారాశి వారందరిలోనూ ఈ లక్షణాలు కన్పిస్తాయి. ఈ రాశిలో జన్మించినవారు చాలావరకు ముక్కు సూటిగా ఉంటారు. ఎదుటివారు విమర్శించినా సరే చాలా విషయాల్లో తమకు నచ్చిన విధంగానే ఉండేందుకు ప్రయత్నిస్తారు.

అలాగే నాయకత్వం వహించే లక్షణాలు, పదిమందికీ సాయం చేయాలనే ఆలోచన వీరిలో మెండుగా ఉంటుంది. అయితే ఈ లక్షణాలే ఒక్కోసారి వీరిని చిక్కుల్లో పడేస్తుంటాయి. వీరిలోని దుడుకుతనం సైతం వీరికి ప్రమాదంగానే పరిణమిస్తుంటుంది. అయితే ఎదుటివారికి కీడు చేయాలనే ఆలోచనమాత్రం వీరిలో ఏ కోశానా ఉండదు. పైపెచ్చు ఎవరైనా తమ వ్యక్తిత్వాన్ని తప్పుబడుతూ విమర్శిస్తే నిలువెల్లా కంపించి పోతారు. అలాంటి సమయాల్లో కన్నీళ్లు పెట్టుకుని బేలగా మారిపోతుంటారు.

వెబ్దునియా పై చదవండి