తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠతను రేపుతున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం కొద్దిసేపటి క్రితం మెరీనా తీరంలో అమ్మ జయలలిత సమాధి వద్ద మౌనదీక్షకు దిగారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలకు కంటతడి పెట్టుకున్నారు. అమ్మ జయలలిత ఆత్మ తనను నిజాలు చెప్పమని ఆదేశించిందని ఆయన వెల్లడించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌ను నియమించాలని అమ్మ ఆదేశించింది. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నాడీఎంకేను వీడే యోచనలో పన్నీర్ సెల్వం వున్నట్లు తెలుస్తోంది. శశికళ తీరుతో తీవ్ర మనస్తాపానికి గురైన పన్నీర్ సెల్వం జయ సమాధి వద్ద గంటన్నరకు పైగా మౌన దీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జయలలితను ఆసుపత్రికి తీసుకొచ్చేనాటికే ఆమె ఆరోగ్యం సరిగా లేదన్నారు. సుమారు 70 రోజుల పాటు ఆమె అనారోగ్యంతో పోరాడారు.
ఆ సమయంలో తనను ముఖ్యమంత్రి పదవిని స్వీకరించమని అడిగారు. కానీ అందుకు తను అంగీకరించలేదని చెప్పారు. కనీసం పార్టీ బాధ్యతలను స్వీకరించమని చెప్పారన్నారు. ఐతే ఆమె మరణించాక పార్టీని అగౌరవపరచలేకే పదవిని చేపట్టానని అన్నారు. కాగా పన్నీర్ సెల్వం వెంట 31 మంది ఎమ్మెల్యేలు వున్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి ఇక అన్నాడీఎంకే చీలిక ఖాయం అని తెలుస్తోంది.