ఏ పదవీ వద్దు: పన్నీర్‌ సెల్వం తీవ్ర మనస్తాపం

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (05:52 IST)
తమిళనాడు రాజకీయాల్లో శరవేగంగా జరిగిన పరిణామాలతో సీఎం పదవిని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలికి వదులుకున్న పన్నీర్ సెల్వం తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. శశికళ ఒత్తిడితో, ఆమె వర్గం ఒత్తిడితో బలవంతంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చిన పన్నీర్ సెల్వం ఇక తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు  సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది. శశికళ నేతృత్వంలోని ప్రభుత్వంలో తనకు ఏ పదవి ఇచ్చినా తీసుకునేది లేదని పన్నీర్‌సెల్వం కరాఖండిగా చెప్పినట్లు సమాచారం.
 
ఆదివారం సీఎం పదవికి పన్నీర్‌సెల్వం చేసిన రాజీనామాను గవర్నర్‌ ఆమోదిస్తూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు జరిగే వరకు కొనసాగాల్సిందిగా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. శశికళపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పన్నీర్‌సెల్వం నియోజకవర్గం ప్రజలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాగా, ఈ నెల 9న ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు శశికళ సిద్ధమవుతున్నారని సమాచారం. గవర్నర్‌ రాగానే కలిసేందుకు ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సీఎం పగ్గాలు చేపట్టిన తర్వాత పోటీ చేయడానికి నియోజకవర్గాలను ఆమె అన్వేషిస్తున్నా రు. జయ ప్రాతినిధ్యం వహించిన చెన్నై ఆర్కేనగర్‌లో శశికళపై తీవ్ర వ్యతిరేకత ఉంది. 
 

వెబ్దునియా పై చదవండి