అయితే తాజాగా జయలలిత ఆరోగ్యానికి సంబంధించి రాజ్‌భవన్ నుండి ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదలైన సంగతి తెలిసిందే. అపోలో హాస్పిటల్ ఛైర్మన్‌తో జయలలిత ఆరోగ్యం గురించి గవర్నర్ అడిగి తెలుసుకున్నారని, జయలలిత ఆరోగ్యం మెరుగుపడుతోందని, చికిత్స అందిస్తున్న విధానం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ… డాక్టర్లను అభినందించారని, అలాగే జయలలితను పరామర్శించి, పండ్లు ఇచ్చి త్వరగా కోలుకోవాలని చెప్పినట్లుగా ఈ లేఖలో పేర్కొన్నారు.
ఇదిలావుంటే జయలలిత ఆరోగ్యంపై వదంతులు పుట్టించిన 40 మందిపై చెన్నై నగర పోలీసులు కేసులు నమోదు చేశారు. వదంతులు పుట్టించిన వారిమీద కఠిన చర్యలు తీసుకోంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. జయలలిత ఆరోగ్యం విషయంలో అవాంచనీయ ఘటనలు చోటుచేసుకునేలా వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విట్టర్ల ద్వారా కొందరు అసత్య ప్రచారం చేశారు. ఇలాంటి ప్రచారం చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే నాయకులు చెన్నై నగర పోలీసు కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
మొత్తం 40 ఫిర్యాదులు చేశారని, 40 మంది మీద కేసు నమోదు చేశామని చెన్నైనగర అదనపు పోలీసు కమిషనర్ శంకర్ మీడియాతో వెల్లడించారు. సోషల్ మీడియా సర్వర్ అమెరికాలో ఉన్నందున నిందితులను గుర్తించడం కొంచెం ఆలస్యం అవుతుందని అన్నారు. అమ్మ ఆరోగ్యంపై వదంతులు వ్యాపించడానికి కారణం అయిన వారిని ఎట్టిపరిస్థితిలో వదిలిపెట్టమని చెన్నై నగర అదనపు పోలీసు కమిషనర్ శంకర్ చెప్పారు. ఇప్పటికే కొందరి చిరునామాలు గుర్తించామని ఆయన అన్నారు.