అటు పళని, ఇటు పన్నీరు.. ఇద్దరినీ వణికిస్తున్న దినకరన్.. 34 మంది ఎమ్మెల్ల్యేలను తిప్పుకున్నాడే.!

శనివారం, 17 జూన్ 2017 (06:08 IST)
తమిళనాడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన మరుక్షణంలో ఎడపాడి పళని స్వామి ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తేలిపోయింది. బహిష్కరణకు గురై, జైలు కెళ్లి వచ్చినా పవర్ తగ్గని టీవీవీ దినకరన్ కేవలం వారం రోజుల వ్యవధిలో 34 మంది అన్నాడీఎంకే ఎమ్మల్యేలను తన వైపు తిప్పుకోవడం అటు ముఖ్యమంత్రి పళనిస్వామిని, ఇటు మాజీ సీఎం పన్నీర్ సెల్వంని ఇద్దరినీ వణికిస్తోంది. దీంతో దినకరన్‌ని ఎలా కట్టడి చేయాలని పళనిస్వామి, ప్రభుత్వం కూలిపోతే తన పరిస్థితి ఏమిటని పన్నీర్ సెల్వం కంగారు పడుతున్నట్లు సమాచారం. 
 
టీటీవీ దినకరన్‌ను ఆయన వర్గ ఎమ్మెల్యేలు శుక్రవారం ఉదయం కలుసుకుని రహస్య చర్చలు జరపడం అన్నాడీఎంకే శ్రేణుల్లో ఆలోచనలు రేకెత్తించింది. పార్టీ బాధ్యతలు చేపట్టాలని, కార్యాలయానికి వచ్చి క్రియాశీలకంగా వ్యవహరించాలని కొందరు ఎమ్మెల్యేలు దినకరన్‌ను పట్టుపడుతున్నారు. అన్నాడీఎంకే (అమ్మ)లోని ఎమ్మెల్యేల తిరుగుబాటు ధోరణి సీఎం ఎడపాడి, మాజీ సీఎం పన్నీరును కంగారుపెడుతోంది. ప్రభుత్వం కూలిపోతుందని ఎడపాడి, అండగా ఉండి నిలబెట్టే అవకాశాలు నీరుగారిపోతున్నాయని పన్నీర్‌ ఆందోళనలో మునిగిపోయారు. 
 
అయితే దినకరన్‌ను కట్టడి చేయడం ఎలాగని సీఎం ఎడపాడి అడపాదడపా పార్టీ కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యేలతో సమావేశం అవుతున్నారు. ఈ దశలో దినకరన్‌ వర్గ ఎమ్మెల్యేలు తమ తరువాత ఎత్తు ఏమిటనే ఆలోచన చేసినట్లు సమాచారం. దినకరన్‌వైపు 34 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు తెలుస్తుండగా వీరి సహాయంతో ఎడపాడి ప్రభుత్వాన్ని కూల్చే అవకాశాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఎడపాడిపై విశ్వాసపరీక్ష పెట్టించి సదరు 34 మంది వ్యతిరేక ఓటువేస్తే ప్రభుత్వం కూలిపోవడం ఖాయం. 
 
తన వైపున్న ఎమ్మెల్యేల బలంతో ఎడపాడి ప్రభుత్వాన్ని కాపాడడం అసాధ్యమని తెలుసుకున్న మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గం కంగారుపడుతోంది. అంతేగాక అన్నాడీఎంకే రాజకీయాలు ఎడపాడి, దినకరన్‌ల చుట్టు మాత్రమే పరిభ్రమిస్తుండంతో తన వర్గాన్ని నిలబెట్టుకోవడం సాధ్యమా అనే భయం పన్నీర్‌లో నెలకొంది. ఎడపాడి, దినకరన్‌ ప్రభుత్వం, పార్టీని పంచుకుంటే తనగతేమిటనే మీమాంశలో పన్నీర్‌ పడిపోయారని తెలుస్తోంది. 
 
అలాగే దినకరన్‌ తనవద్ద నున్న ఎమ్మెల్యేల బలంతో తనను పదవీచ్యుతుడిని చేస్తాడని ఎడపాడి సైతం భయపడుతున్నారు. దీంతో గురు, శుక్రవారాల్లో అసెంబ్లీ సమావేశాలు ముగియగానే సాయంత్రం వేళ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. కాగా, గురువారం మధ్యాహ్నం దినకరన్‌ బెంగళూరు వెళ్లి శశికళతో రెండుగంటపాటు ములాఖత్‌ అయ్యారు. అన్నాడీఎంకేలో పరిణామాలపై చర్చించినట్లు సమాచారం. మారుతున్న రాజకీయ పరిణామాల్లో ఎడపాడి, దినకరన్‌ ప్రధానపాత్ర పోషిస్తుండగా, విలీనంపై బెట్టుచేయడం ద్వారా నష్టపోకుండా తన వర్గాన్ని నిలబెట్టుకునేందుకు పన్నీర్‌ ప్రయత్నాలు ప్రారంభించారు.
 

వెబ్దునియా పై చదవండి