పరీక్షలంటే పిల్లలకే కాదు, పెద్దలకుకూడా పరీక్షా సమయమే. అందునా మరీ చిన్నపిల్లలకైతే మరీనూ... ఓ వైపు తల్లిదండ్రులు, మరోవైపు అధ్యాపకబృందం. వీటితోబాటు వారి చంచలమైన మనస్తత్వం. దీంతో వారు ఏం చదవాలనేదానిపై ఓ నిర్ణయానికి రాలేకపోతారు.
పరీక్షలనంగానే వారిలో తెలియని భయం, ఒత్తిడి ఏర్పడుతుంది. అలాగే పరీక్షలలో మంచి మార్కలు సంపాదించాలనే తీవ్రమైన ఒత్తిడికి గురౌతుంటారు వారు. పిల్లలు వారితోబాటు తల్లిదండ్రులకు కొన్ని చిట్కాలు. దీంతో పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణులవడానికి అవకాశం ఉంటుంది. ప్రముఖంగా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహిస్తుంటే వారు దేనినైనా సాధించే అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
సక్సెస్ మంత్ర :-
** తొలుత ఓ టైం టేబుల్ తయారు చేసుకోండి. ఆ టైం టేబుల్‌ననుసరించి చదవడం ప్రారంభించండి. సబ్జెక్ట్ ప్రకారం టైం టేబుల్‌ను ఏర్పాటు చేసుకోండి. దీంతో చదవడానికి సులువుగా ఉంటుంది.
** చదవడానికి ఏకాగ్రత ముఖ్యం. దీనికిగాను ఉదయమే త్వరగా నిద్రనుంచి లేవాలి. కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత ధ్యానం చేయండి. దీంతో మీలో ఏకాగ్రత కుదురుతుంది.
** ప్రతి రోజూ టెస్ట్ పేపర్‌ను తయారు చేసుకుని ఓ నిర్ధారిత సమయంలో దానికి సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి. దాని తర్వాత జవాబు పత్రాన్ని చూసి మీరు రాసిన సమాధానాలకు మార్కులు వేసుకోండి. టెస్ట్ పేపర్‌లు ఇప్పుడు అన్ని పుస్తకాల దుకాణాలలో లభ్యమవుతున్నాయి.
** గంటల కొద్దీ కూర్చుని చదవడం కన్నాకూడా కాసేపయినా ఏకాగ్రతతో చదివితే అదే మీకు లాభసాటి కాగలదు.
** చదువుకునేటప్పుడు ప్రతి రెండు-మూడు గంటలకొకసారి కాసింత బ్రేక్ అవసరం. దీంతో కాస్త రిలాక్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో బిస్కేట్లు, గ్లూకోస్ లాంటివి తీసుకోండి. వీటివలన శరీరంలో కాస్త చురుకుదనం వస్తుంది.
** రాత్రి పొద్దుపోయేవరకు చదివేకన్నాకూడా ఉదయమే త్వరగా నిద్ర లేచి చదవడం ఉత్తమం.
** మీరు మీ మిత్రులతో కలిసికూడా చదవవచ్చు. దీనినే గ్రూప్ స్టడీస్ అంటారు. అలాకూడా చదువుకోవచ్చు.
** చదువుకునేటప్పుడు అలాగే పరీక్షలకు వెళ్ళేటప్పుడు మీ మనసులో ఎలాంటి విపరీతాత్మక ధోరణికి(నెగెటివ్) సంబంధించిన ఆలోచనలు చేయకండి. ఉదాహరణకు ఈ ప్రశ్నలు వస్తాయా..రావా.. ఫలానా ప్రశ్న వస్తే నేను సమాధానం రాయగలనా లేదా.. అనే అపోహలు మనసులోకి రానీయకండి.
** పరీక్ష రాయడానికి వెళ్ళేటప్పుడు ఆత్మవిశ్వాసంతో వెళ్ళండి. దీంతో ప్రశ్నాపత్రానికి సమాధానాలు చక్కగా రాయగలరు. ఇలాంటి సందర్భంలో తల్లిదండ్రులుకూడా వారికి వెన్నుదన్నుగా నిలవాలి. పిల్లల్ని ప్రోత్సహించడానికి ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితులలోనూ వారిని కించపరచి మాట్లాడకండి.
** నేను పరీక్షలను సరిగా రాయలేననే విషయాన్ని మాత్రం పరీక్షాంతం వరకుకూడా ఆలోచించకండి. కష్టపడి తానుకూడా పరీక్షలు రాసి మంచి మార్కులు తీసుకువస్తావని తల్లిదండ్రులుగా మీరుకూడా వారిని ప్రోత్సహించాలి.
** పరీక్ష హాలులోకి ప్రవేశించిన తర్వాత ప్రశాంతంగా కూర్చోండి. ఇన్విజిలేటర్ ప్రశ్నాపత్రాన్ని ఇచ్చిన వెంటనే ముందుగా ప్రశ్నపత్రం పూర్తిగా చదవండి. తొలుత అర్థంకాకపోతే మరోసారి చదవండి. దాని తర్వాత వాటికి సమాధానాలు రాయడానికి పూనుకోండి. తొందరపడి జవాబులు రాయకండి. ప్రతి ప్రశ్నకు సమాధానాలు రాయడానికి ప్రయత్నించండి. సమాధానాలు రాసేటప్పుడు తొందరపడితే తప్పులు దొర్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి తొలుత మీకు తెలిసిన సమాధానాలను రాయండి. ముందుగా ప్రశ్న సంఖ్యను రాయడం మరువకండి.
** ఏ ప్రశ్నకు మీరు సమాధానం రాయాలనుకుంటారో, ఆ ప్రశ్నకు సమాధానం రాసేంతవరకు మీరు మరో ప్రశ్నగురించి ఆలోచించకండి. సమాధానాలు రాసేటప్పుడు సమయాన్నికూడా పాటించండి. ఎట్టిపరిస్థితులలోనూ సమయాన్ని వృద్ధా చేయకండి.