పిల్లలకు అన్నం పెట్టడం ఓ ప్రహసనంగా వుంటోందా..?

మంగళవారం, 4 సెప్టెంబరు 2012 (17:19 IST)
WD
ముందుగా పిల్లల్ని టివీ ముందు కూర్చోని భోజనం చేయడాన్ని అంగీకరించవద్దు. డైనింగ్ టేబుల్ వద్ద ఓ పద్ధతిగా కూర్చోవడాన్ని అలవరచాలి. కుటుంబ సభ్యులు అందరూ కలిసి కూర్చునే అలవాటు చేసుకోవాలి. నిర్ణీత వేళ ప్రకారం భోజనానికి ఉపక్రమించాలి. బ్రేక్‌ఫాస్ట్ స్నాక్స్, డిన్నర్- ఏదైనా వేళ ప్రకారం టేబుల్ దగ్గరకు వచ్చి మాత్రమే తినాలని వారికి స్పష్టంగానే తెలియచెప్పాలి.

చాలామంది పిల్లలు కూర్చున్న చోటుకే ప్లేట్లు తీసుకు వెళ్ళి ఇస్తుంటారు. ఇది తగదు. వీలైనంత వరకు తినిపించడాన్ని మానుకోవాలి. స్పూన్‌తో లేదా చేత్తో ఎలా వీలైతే ఆ విధంగా తినే పద్ధతి నేర్పించాలి. ఏదో ఒకటి ఎంచుకుని తినే ధోరణి సరైంది కాదు. ఎటువంటి ఆహారం వల్ల ఆరోగ్యం కలుగుతుందో వారికి వివరించాలి. మెదడు మందగించడం, కోపం, చిరాకు, దిగులు, ఆందోళన వంటి వాటన్నింటిని ఆహార లేమే కారణమని పిల్లలకు వివరిస్తుంటే, ఆరోగ్యపూరిత ఆహారం వైపునకు వారి మనస్సు మొగ్గుతుంది.

ఎటువంటి ఆహారం వల్ల ఏ ప్రయోజనం కలుగుతుందో వారికి అవగాహన అవసరం. దీనివల్ల తరుచూ చిరుతిండ్లు వైపునకే దృష్టి సారించకుండా వుంటారు. పాలు, గుడ్లు, పండ్లు, కార్న్‌ఫ్లేక్స్, నట్స్, కూరగాయలు తప్పనిసరిగా తినాల్సిన ఆహారమని తెలియజెప్తుండాలి. భోజనం వేళ పిల్లలు ఉత్సాహపడేలా వుండాలే తప్ప భయపడేలా వుండరాదు.

వెబ్దునియా పై చదవండి