గాఢంగా నిద్రపోతున్న చిన్నారులు ఒక్కోసారి ఉలిక్కిపడి లేచి, ఏడుపు లంకించుకుంటుండటం సహజమే. పీడకలలు రావటం వల్లనే పిల్లలు అలా ఉలిక్కిపడుతుంటారని పిల్లల నిపుణులు చెబుతున్నారు. అందుకనే పడుకునే ముందు, పడుకుని ఉండగా చిన్నారుల్ని టీవీ చూడనీయకపోవటం ఉత్తమం. టీవీ వెలుతురుకు వేరే వేటినైనా ఊహించుకుని పిల్లలు భయపడుతుంటారు. అలాంటప్పుడు పీడ కలలు ఎక్కువ అవుతాయి. కాబట్టి టీవీ చూడనీయకపోవటమేగాకుండా, టీవీ వెలుతురు వారిపై పడకుండా జాగ్రత్త పడాలి.
* అదే విధంగా పడక గదిలో మరీ చీకటిగా ఉన్నా కూడా పిల్లలు ఏవేవో ఊహించుకుని భయపడుతుంటారు. అలాంటప్పుడు కూడా వారిని పీడ కలలు వేధిస్తుంటాయి. కాబట్టి పడక గదిలో తక్కువ వెలుతురు ఇచ్చే బెడ్ లైటులను వాడటం అవసరం. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే.. వారి పడకలను రోజుకొక చోటికి మార్చకూడదు, ఎప్పుడూ ఒకేచోట ఉండేలా చూడాలి. పడకను మార్చటంవల్ల పిల్లలు సుఖనిద్రకు దూరమై, నిద్రలో తేడాలు జరగటంతో పీడకలల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
* పిల్లలతో మనసువిప్పి మాట్లాడుతూ.. వాళ్లు దేని గురించి ఎక్కువగా భయపడుతున్నారో పెద్దలు మెల్లిగా అడిగి తెలుసుకోవాలి. అలా మాట్లాడుతూనే ప్రతి ఒక్కరికీ భయం ఉంటుందనీ, భయం అనేది సహజమేననీ.. అయితే భయాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదనీ నచ్చజెప్పాలి. ఇలా చెప్పటంవల్ల రాత్రుళ్లు తమతోపాటు అందరూ భయపడుతుంటారని వారు అర్థం చేసుకుంటారు. దాంతో వారిలో నెమ్మదిగా ఆందోళన తగ్గుతుంది. ఆ తరువాత పీడకలలు కూడా తగ్గి పిల్లలు సుఖంగా నిద్రపోతారు.