పిల్లలు మాత్రలు వేసుకోవడానికి ఇష్టపడనప్పుడు ఏం చేయాలి?

గురువారం, 22 మార్చి 2012 (17:53 IST)
FILE
చాలా మంది పిల్లల నుంచి ఎదురయ్యే సమస్య ఇది. కొందరికి మాత్రల వాసన అస్సలు పడదు. మరికొందరు చేదుగా ఉంటాయని ససేమిరా అంటుంటారు. బలవంతంగా మింగిస్తే వాంతి చేసేసుకుంటారు. ఇలా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనముండదు.

మాత్రలకు బదులుగా సిరప్‌లు ఉంటే పర్వాలేదు కానీ లేకుంటే ఇబ్బంది తప్పదు. వారిని తిట్టి, బెదిరించి, బలవంతంగా మాత్రలు మింగించడం కాకుండా, ఈ విషయంలో కొంత ఓర్పుగా వ్యవహరించాల్సి ఉంటుంది. అనారోగ్యంగా ఉన్నప్పుడు మాత్రల అవసరాన్ని, వాటిని మింగకపోతే కలిగే నష్టాల గురించి పిల్లలకు చెప్పాలి.

ఓర్పుగా ఉంటూనే ఖచ్చితంగా వ్యవహరించాలి. నచ్చజెప్పి, నయానో భయానో మింగించాలి. దగ్గరకు తీసుకుని బుజ్జగించాలి. మందులు వేసుకునే సమయంలో ఆహారానికి సంబంధించి చిన్నచిన్న ప్రత్యామ్నాయ అవకాశాలను వారికే ఇస్తూ ఉంటే కొంత ఉత్సాహాన్ని చూపుతారు.

వీలైతే వివిధ రకాలైన జ్యూస్‌లు, ఇతర ఆహార పదార్థాలతో కలిసి ఇవ్వచ్చు. అందమైన మోడలింగ్ స్పూన్లు ఉపయోగిస్తే ఆకర్షణీయంగా ఫీలవుతారు. అంతేకానీ.. పిల్లలతో మందులు మింగించాల్సిన సమయాన్ని మాత్రం అదో భయంకరమైన పనిగా మాత్రం భావించొద్దు.

వెబ్దునియా పై చదవండి