పిల్లల్లో మానసిక ఒత్తిడిని గుర్తించటం ఎలా..?

FILE
* సాధారణంగా చిన్నారుల్లో మానసిక ఒత్తిడిని గుర్తించటం చాలా కష్టమైన పని. ఇలాంటి ఒత్తిడికి గురైన పిల్లల్లో కొన్ని లక్షణాలను గుర్తించి, వాటి ద్వారానే వారు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని అర్థం చేసుకోవచ్చు. అలాంటి వాటిలో నోట్లో వేలు పెట్టుకోవటం, జుట్టు మెలిపెట్టుకోవటం, ముక్కు గిల్లుకోవటం.. లాంటి ప్రవర్తనలు కొన్ని. వీటి ద్వారా పిల్లల మానసిక ఒత్తిడిని గుర్తించవచ్చు.

* కాస్త పెద్ద వయసు పిల్లల్లో అయితే అబద్ధాలు చెప్పటం, తోటి పిల్లలని కొట్టటం, హింసించటం, పెద్దవాళ్ళని ఎదిరించటం, రోజువారీ పనులు మరచిపోవడం, నిద్రలేమి, నిద్రలో మూత్ర విసర్జన, వాంతులు, విరేచనాలు, తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి, నిస్సత్తువ లాంటి లక్షణాలు మానసిక ఒత్తిడికి సంకేతాలుగా చెప్పవచ్చు. కొంతమంది పిల్లలలో ఈ ఒత్తిడి మూలాన పీడ కలలు, అతి భయం, చిన్న చిన్న విషయాలకి కూడా అతిగా స్పందించటం, అకస్మాత్తుగా చదువులో వెనకబడటం, తమని తాము హింసించుకోవటం లాంటివి కూడా సంభవిస్తుంటాయి.

* పిల్లల మానసిక ఒత్తిడి స్థాయిని బట్టి, వారు పెరిగే వాతావరణాన్ని బట్టి, తల్లితండ్రులతో వారికున్న సంబంధ బాంధవ్యాలను బట్టి మానసిక ఒత్తిడిని కలిగించే లక్షణాలు ఉంటాయి. దీన్నుంచి పిల్లల్ని దూరం చేయాలంటే.. పిల్లలలో ఎలాంటి అసహజ ప్రవర్తన కనిపించినా తల్లిదండ్రులు అప్రమత్తం అవ్వాలి, అంతేగానీ ఇవన్నీ పిల్లలలో సహజమే కదా అని వదిలేయకూడదు. ముందుగా పిల్లలకి మంచి పౌష్టికాహారం, తగినంత విశ్రాంతి కల్పించాలి. తల్లిదండ్రులు పిల్లలతో సన్నిహితంగా మెలగాలి. ఎప్పుడూ పిల్లలకి అందుబాటులో ఉండాలి.

వెబ్దునియా పై చదవండి