* ఆసుపత్రిలో ఉన్నా, ఇంట్లో ఉన్నా పుట్టిన బిడ్డకు స్నానం చేయించాక నేతిలో దూదిని ముంచి మాడుపై ఉంచితే.. పలుచగా ఉండి, పూర్తిగా అతుక్కోకుండా ఉండే తల ఎముకలు కలసిపోయి గట్టిపడతాయి. ఎదుగుతున్న పాపాయిని ఉదయం కాళ్లపై పడుకోబెట్టుకుని శరీరంలోని అన్ని అవయవాలకి నువ్వులనూనెతో సున్నితంగా మర్దనా చేసి వేడినీటితో స్నానం చేయించాలి. ఆ తర్వాత సాంబ్రాణి పొగవేసి, గంధంపొడిని శరీరానికి అద్దితే చర్మం, కండరాలు బలపడి చక్కగా ఎదుగుతారు.
* ముందుగా పాలు పట్టించటం, అన్నప్రాసన తరువాత పల్చటి ఆహారసారం, ఆ తర్వాత పూర్తిగా ఉడికించిన అన్నం పాపాయికి పెట్టడం మంచిది. ఏడాదిలోపు పిల్లలకి మెత్తటి అన్నంలో కొంచెం నెయ్యి, వాము, చిటికెడు ఉప్పు కలిపి మొదటి ముద్ద పెట్టడాన్ని గోరుముద్ద అంటారు. అది బిడ్డకు తల్లి ఇచ్చే జీవామృతం. అన్నంలో శక్తినిచ్చే కార్బోహైడ్రేటులు, వాములో జీర్ణశక్తిని పెంచే ఎంజైములు, నెయ్యిలో మేధస్సును పెంచే ఐక్యూలు ఉంటాయి.
* పాలు, తేనె, నెయ్యి మధుర పదార్థాలే కాదు, జీవ రసాయనాలు కూడా. అందుకే ఎదిగే పిల్లలకు ఇవి ఎక్కువగా ఇవ్వాలి. పదకొండేళ్లు వచ్చిన ఆడపిల్లలకు నువ్వులు బెల్లంతో చేసిన నువ్వుల ఉండలు, మినపగారెలు పెడుతుంటే.. హార్మోన్లు సరిగా పెరిగి చక్కగా ఎదుగుతారు. మగపిల్లలకు పదహారేళ్లు వచ్చాక మినపపిండి, బెల్లం, నెయ్యితో చేసిన మినపసున్నుండలు పెడితే హార్మోన్లు స్థిరపడతాయి.