ఒక సంవత్సరం నుంచి మూడేళ్ల వరకు పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలంటే... ఈ ప్రాయంలో పిల్లల మెదడు సామర్థ్యం పెరుగుతుంది. అందుచేత క్రొవ్వుతో కూడిన ఆహారం ఇవ్వాల్సి వుంటుంది. చిన్నారి బరువు తగ్గట్టు ఒక కిలోకు వంద కెలోరీలు, 1.2 గ్రాముల ప్రోటీన్లు మరియు విటమిన్ ఎ, సి ఉండే ఆహారాన్ని ఇవ్వాలి.
ఆహారం తీసుకోకుండా మారాం చేసే పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఇందుకు ఏం చేయాలంటే.. పసుపు రంగుతో కూడిన పండ్లను చిన్నారులకు ఇస్తూ ఉండాలి. టమోటా, ఆరెంజ్ వంటివి ఇవ్వొచ్చు. కారట్, బంగాళాదుంప, చేపలు, ఆకు కూరలు ఆహారంలో చేర్చుకుంటూ వుండాలి. వీటి ద్వారా విటమిన్ ఎ లభిస్తుంది.
అలాగే కొవ్వు శాతం అధికంగా ఉండే పాలు ఇవ్వడం మరిచిపోకూడదు. చిన్నారులు పాలను తాగడం ద్వారా నరాల బలహీనత వంటి సమస్యలు భవిష్యత్తులో ఏర్పడకుండా నివారించవచ్చు. ఉదయం ఒకటిన్నర కప్పు అన్నం, బంగాళాదుంప ఇవ్వొచ్చు. ఇందులో కాయగూరలు కూడా చేర్చొచ్చు. అలాగే ఉడికించిన ఉప్మా, సేమియా కూడా ఇవ్వడం మంచిది.
మధ్య మధ్యలో ఉడికించిన పప్పులు, ఫ్రెష్ జ్యూస్, ఉడికించిన కోడిగుడ్డు/ చేపలు/ మటన్ ఇవ్వొచ్చు. ఆకుకూరల్ని బాగా ఉడికించి మెత్తగా చేసి చిన్నారులను ఇవ్వాలి. వెన్న, నూనెను కొంచెం కొంచెంగా చేర్చుకోవచ్చు.