రోజంతా పిల్లలతో మాట్లాడాలని లేదు. వాళ్లు ఎక్కువగా మాట్లాడే సమయం గుర్తించండి. ఉదాహరణకు రాత్రిళ్లు పడుకునేటప్పుడూ, భోజనం చేసే సమయంలో, ఎక్కడికైనా వెళ్తున్నప్పుడూ వాళ్లతో చక్కగా మాట్లాడండి.
ఆ సమయాన్ని సద్వినియోగం చేస్తూ మీరే సంభాషణను మొదలు పెట్టండి. దానివల్ల వాళ్ల గురించి మీరు పట్టించుకుంటున్నారనే సంకేతాన్ని అందించిన వారవుతారు. స్కూలు, చదువులూ, స్నేహితులూ.. ఇలా అడగకముందే తమ గురించిన అన్ని విషయాలు చెప్పడం మొదలెడతారు.
* పిల్లలతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నప్పుడు మీరు దాన్ని ప్రశ్న రూపంలో అడగకూడదు అంటారు చైల్డ్ కేర్ నిపుణులు. మీ సందేహాల్ని వాళ్లకు అర్థమయ్యేలా వివరించండి. ఉపన్యాసంలా చెప్పడం, విమర్శించడం, భయపెట్టడం, బాధపడేలా తిట్టడం లాంటివి చేయకూడదు. పిల్లలు ఏదైనా చెబుతున్నప్పుడు ఏ పనిచేస్తున్నా కొన్ని క్షణాలు ఆపి ఆసక్తిగా వినండి. తర్వాత మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
* మీరే విధంగా చెబితే వాళ్లు వింటున్నారో గమనించి అదే స్వరంతో చెప్పడానికి ప్రయత్నించండి. అంతేతప్ప కోపంగానో, గట్టిగా అరిచో చెబితో వాళ్లు పట్టించుకోకపోవచ్చు చాలాసార్లు మన అభిప్రాయాలూ చెబుతుంటే పిల్లలు పెద్దగా పట్టించుకోరు. ఆ పరిస్థితిని అధిగమించాలంటే వాళ్ల అభిప్రాయాల్ని తక్కువ చేస్తున్నట్లు కాకుండా మీరేం అనుకుంటున్నారని తెలియజేయండి.