పరీక్షకు వెళ్లేముందు ఇవన్నీ సిద్ధంగా ఉంచుకున్నారా..?

FILE
* హాల్ టికెట్లను కనీసం రెండు కాపీలయినా చేసి ఉంచుకోవాలి. హాల్ టికెట్‌తోపాటు పెన్నులు, పెన్సిళ్లు, ఎరేజర్లు లాంటివి కూడా సిద్ధం చేసుకోవాలి. పరీక్ష హాల్లో ఏది అవసరం అయినా, పక్కవారిని అడిగే పరిస్థితి తలెత్తకుండా అవసరమైన వాటిని పిల్లలు, పెద్దలు గుర్తించి సిద్ధంగా ఉంచుకోవాలి.

* జవాబులు రాసేటప్పుడు నాణ్యమైన శైలిని ప్రదర్శించటం, అవసరమైనమేర మార్జిన్లు వదలటం, ప్రశ్నల నంబర్లు సరిగా రాయటం, ప్రతి ప్రశ్న-సమాధానాలకు మధ్య తగినంత స్థలం వదలటం లాంటివి తప్పనిసరిగా పాటించాలి. అలాగే సబ్‌హెడ్డింగులకు, ముఖ్యమైన నిర్వచనాలకు అండర్‌లైన్స్ లేదా కొటేషన్స్ లాంటివి పెడితే జవాబు పత్రాన్ని ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతుంది. చేతిరాత అందంగా లేకపోయినా, పై జాగ్రత్తలన్నీ తీసుకుంటే ఆ లోపం కనుమరుగవుతుంది.

* అండర్‌లైన్ చేసేందుకు రెడ్ ఇంక్ వాడకూడదు. మరేదైనా కలర్ వాడితే చాలు. తప్పులు గుర్తించేందుకు, మార్కులు ఇచ్చేందుకు మాత్రమే ఎగ్జామినర్ రెడ్ ఇంక్‌ను వాడతారు కాబట్టి విద్యార్థులు రెడ్ ఇంక్ వాడకూడదు. పరీక్షలపట్ల సానుకూల దృక్పథం పెంచుకునే ఉత్సాహం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. తద్వారా జవాబులు సరిగా రాయగలుగుతారు.

* ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే.. పరీక్షల సమయంలో విద్యార్థులు ఆహారాన్ని ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. వేసవిని దృష్టిలో పెట్టుకుని ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. కేవలం నీళ్లు మాత్రమే కాకుండా పండ్లు, జావ లాంటివి ఆహారంలో తప్పకుండా ఉండేలా చూడాలి. అలాగే ఘనాహారం, కొవ్వు అధికంగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.

వెబ్దునియా పై చదవండి