* ఇంటిని అలంకరించుకోవటంలో భాగంగా గాజు, క్రిస్టల్, పింగాణీల్లాంటి విలువైన వస్తువులను అందరికీ కనిపించేలా సర్దటం మామూలే. అయితే వీటిని పిల్లలకు అందేలా ఉంచితే అవి కిందపడి పగలిపోవటమేగాకుండా, వాటి ముక్కలు పిల్లలకు గుచ్చుకున్నాయంటే ఎంతో ప్రమాదం. అందుకే ఇలాంటి వస్తువులను పిల్లలకు అందనంత ఎత్తులో ఉంచటం శ్రేయస్కరం.
* టీవీ, కంప్యూటర్లకు సంబంధించిన వైర్లు, స్విచ్‌లను నేలపై వేలాడేలా ఉండకూడదు. వాటిని చిచ్చరపిడుగులు పట్టుకుని లాగితే కింద పడిపోతాయి. ఆ వస్తువులు పైనుంచి పిల్లలపై పడితే చాలా ప్రమాదం. అలాగే ఉపయోగించని ఎలక్ట్రానిక్ పరికరాలను పిల్లలకు అందకుండా భద్రపరచాలి. అలాగే ఇంట్లో పిల్లలకు అందేంత ఎత్తులో ఉండే ఫ్లగ్ పాయింట్లకు టేప్‌లు అతికించటం మర్చిపోవద్దు. లేకపోతే పిల్లలు సరదాకి వాటిల్లో వేలు పెడితే షాక్ కొట్టే ప్రమాదం పొంచి ఉంటుంది.
* రకరకాల మందులు, టానిక్‌లు, చిల్లర నాణేలు, చిన్న చిన్న వస్తువులను కూడా పిల్లలకు అందకుండా జాగ్రత్తపడాలి. అవి గనుక పిల్లల చేతికి చిక్కితే వాటిని మింగేయటమో, మరే ఇతర పనులు చేయటమో లాంటివి చేస్తారు. అలాగే వేడిగా ఉండే ఆహార పదార్థాలను కూడా పిల్లలకు అందకుండా చూడాలి. అగ్గిపెట్టెలు, లైటర్లు, కత్తులు, ఫోర్క్‌లు లాంటి వాటిని కూడా వారి చేతికి చిక్కకుండా చూడాలి.