చాలామంది పెద్దవారు తమ పిల్లల్ని ప్రతి విషయంలోనూ ఇంకా చిన్న పిల్లల్లాగే చూస్తుంటారు. తమ పిల్లలు ఏం చెప్పినా దానిని ఆట్టే పట్టించుకోరు. దీనివల్ల పిల్లల్లో పెద్దల పట్ల వ్యతిరేక భావనలు మొగ్గతొడుగుతాయి. అటువంటి భావనలు రాకుండా ఉండాలంటే ముందుగా తల్లి చొరవ తీసుకోవాలి. అందుకు కొన్ని మార్గాలున్నాయి....
పిల్లల్ని పెద్దవాళ్ల లాగా, వ్యక్తులుగా భావించాలి. వారి సొంత హక్కులను గౌరవించాలి. పిల్లలు ఎలా ప్రవర్తించాలనుకుంటున్నారో చెప్పేకంటే ముందు అలా మీరు ప్రవర్తించి చేతల్లో చూపాలి. మీ పిల్లలతో క్వాలిటీ టైమ్ గడపాలనుకుంటే మీరు మీ సొంత అభిరుచులకు పెట్టే సమయాన్ని కొంత తగ్గించుకోవాలన్న విషయాన్ని మర్చిపోవద్దు.
మంచి శ్రోతగా ఉండండి. మీ పిల్లలు చెప్పేది శ్రద్ధగా వినండి. పిల్లలు చెప్పేదేంటి వినేది.. అని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకోవద్దు. మీరు మీ బాల్యంలో ఎలా ఉన్నారో.. ఎలా గడిపారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇప్పుడు మీ పిల్లలు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి.
సూపర్ మామ్ అవ్వాలని ప్రయత్నించవద్దు. అది ఒక అభూత కల్పన. మీరు ఒక సాధారణ వ్యక్తి. మీకంటూ కొంత విశ్రాంతి సమయం కావాలి. అది తప్పక మీకు మీరే కేటాయించుకోవాలి.
అపరాధ భావనను వదిలిపెట్టాలి. మీరు మోసే అతి పెద్ద భారమైన మిమ్మల్ని నాశనం చేసే బరువు కూడా అదేనని గమనించండి. మీ పిల్లల్ని ఎలాంటి కండిషన్లు లేకుండా ప్రేమించండి. వాళ్లకు అవసరమైనప్పుడు వారి పక్కన నిలబడండి. మీ పనుల్లో వాళ్ల సహకారం తీసుకుంటూ ఉండండి.