లడ్డూలని అర నిమిషం మైక్రో ఓవెన్‌లో ఉంచి తీస్తే?

శనివారం, 4 ఆగస్టు 2018 (17:32 IST)
కొన్ని వంటింటి చిట్కాలు మీ కోసం..
లడ్డూలని అర నిమిషం మైక్రో ఓవెన్‌లో ఉంచి తీస్తే తాజాగా వుంటాయి. వెల్లుల్లిని కొద్దిసేపు ఓవెన్‌లో ఉంచి తీస్తే పొట్టు తీయడం సులువు అవుతుంది. ఓవెన్‌ను శుభ్రపరిచేప్పుడు లోపల వంటసోడా చల్లి రాత్రంతా మూత పెట్టి ఉంచాలి. ఉదయమే ఉప్పు, నిమ్మరసం సమానంగా కలిపి దానిలో ముంచిన స్పాంజితో తుడిస్తే దుర్వాసన పోతుంది. బియ్యాన్ని నిల్వ ఉంచేటప్పుడు ఎండిన పుదీనా ఆకులని మెత్తని పొడిగా చేసి కలిపితే పురుగు పట్టకుండా చక్కని సువాసనతో ఉంటాయి. 
 
పచ్చి బఠాణీలు నిల్వ ఉండాలంటే వాటిని పాలిథీన్ సంచిలో వేసి డీప్ ఫ్రీజర్‌‍లో ఉంచాలి. పాలు కాచే పాత్రకి అడుగున కొద్దిగా నెయ్యి రాస్తే దానిని శుభ్రపరచడం తేలిక అవుతుంది. మిఠాయిల తయారీకి పంచదార పొడి చేస్తుంటే, నాలుగు బియ్యం గింజల్ని కూడా కలపండి. పొడి ఉండకట్టకుండా ఉంటుంది. క్యాలీఫ్లవర్‌ను ఉడికించే నీళ్ళలో కాసిని పాలు చేర్చితే రంగు మారకుండా ఉంటుంది.
 
క్యాబేజీ వాసన నచ్చకపోతే దాన్ని ఉడికించేటప్పుడు నీళ్ళలో నాలుగు చుక్కల వెనిగర్, రెండు లవంగాలు వేస్తే సరిపోతుంది. క్యాబేజీ కూర చేసేప్పుడు పైన మూత పెట్టకుండా వుంటే వాసన రాదు. బెండకాయ కూర జిగురుగా వుండకూడదనుకుంటే అందులో కొన్ని టమాటాలను వేసి వండండి.
 
ఆవపిండి పొడిపొడిగా ఉండాలంటే మిక్సీ పట్టేప్పుడు ఆవాల్లో కొద్దిగా ఉప్పు వేయండి. సగ్గుబియ్యం నానబెట్టి రెండు గంటల తర్వాత రుబ్బి మినప్పిండిలో కలిపితే దోశలు పల్చగా వస్తాయి. బెండకాయ వేపుడు చేసేటప్పుడు ముందుగా మూకుడులో ఉప్పు, చిటికెడు పసుపు కలిపితే ముక్కలు నూనెను పీల్చుకోవు. ఆమ్లెట్ పొంగినట్టుగా రావాలంటే కోడిగుడ్డు సొనని గిలక్కొట్టే ముందే అందులో చిటికెడు ఉప్పు వేస్తే సరిపోతుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు