సహజంగా మహిళలందరికీ తెలిసే ఉంటుంది కాయగూరలు ఎలాంటివి తీసుకోవాలో అని, కానీ కొన్ని సమయాల్లో దాన్ని మర్చిపోవడమో లేక తెలియకనో చిన్న చిన్న తప్పులు చేస్తుంటారు. ఇంకా అందులోని కొందరు అవసరానికి ఏదో ఒకటి అని తెచ్చి వంట చేసే వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారు ఈ జాగ్రత్తలు తీసుకున్నటైతే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా చూసుకోవచ్చు.
* వంకాయలు వాడిపోకుండా, మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా ఉండకుండా చూసుకోవాలి. తొడిమ ఆకుపచ్చరంగులో తోలునిగనిగలాడుతూ పుచ్చులు లేకుండా చూడాలి.
* బంగాళాదుంపలు గట్టిగా ఉండాలి. పైపొర తీసినప్పుడు లోపలిభాగం లేత పసుపు పచ్చని రంగులో ఉండాలి. బంగాళా దుంపపైన నల్లటి మచ్చలు లేదా ఆకుపచ్చని మచ్చలు ఉన్నట్లయితే వాటిని పొరపాటున కూడా కొనవద్దు. దుంపలపైన గుంటలు లేకుండా నున్నగా ఉండేవి చూసి కొనండి.
* అల్లం మరీ గట్టిగా లేదా మరీ మెత్తగా లేకుండా ముదురు రంగులో ఉన్నదానిని చూసి కొనాలి. అల్లం పై పొర తీసి వాసన చూసి దాని ఘాటును బట్టి కొనాలి.
* ఉల్లిపాయలు గట్టిగా ఉన్నవి మాత్రమే కొనాలి. వీటి పై పొరలో తేమ ఉంటే అసలు కొనవద్దు.
* మంచి ఆకారం కలిగివున్న క్యారెట్‌నే కొనాలి. వంకరగా ముడతలతో, ఎత్తు పల్లాలుగా వున్న వాటిని కొనకూడదు. క్యారెట్ మొత్తం మెత్తగా ఉన్నా, మరీ మెత్తగా ఉంటే కొనరాదు. ఇవి లేతగా ఉంటే మరీ మంచిది.
* బీట్‌రూట్ కొనేముందు దాని కింద భాగంలో వేర్లువున్న వాటిని ఎటువంటి మచ్చలు, రంధ్రాలు లేనివి చూసి కొనాలి.
* క్యాలిఫ్లవర్ కొనేముందు దాని ఆకులు ఆకుపచ్చని రంగులో వుండేలా చూసుకోవాలి. పచ్చదనం లేని ఆకులున్న వాటిని కొనద్దు. పువ్వు విడిపోకుండా దగ్గరగా వున్న వాటినే కొనాలి.
* ఆకుకూరలు కొనేముందు వాటిపైన తెల్లటి మచ్చలు లేకుండా చూసుకోవాలి. వాటి కాడలు తాజాగా, లేతగా ఉండేటట్లు చూసుకోవాలి.