దేశంలో కరోనా వైరస్ స్పీడు ఏమాత్రం తగ్గడం లేదు. ఫలితంగా గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా మొత్తం 1,780 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 33,050కి చేరింది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో ఈ కేసులు 313గా నమోదయ్యాయి.
ఇకపోతే, గత 24 గంటల్లో కరోనా వైరస్ బారినపడిన వారిలో 630 మంది కోలుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. దేశంలో కరోనా రికవరీ రేటు 25 శాతంపైగానే ఉందన్నారు. కరోనా నుంచి ఇప్పటివరకు 8,324 మంది కోలుకున్నారన్నారు.
ఇప్పటివరకు నమోదైన కరోనా మరణాల్లో 78 శాతం కరోనా మరణాల్లో ఇతర వ్యాధులు కూడా ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకే పరీక్షలు చేయాలని, లారీ డ్రైవర్లకు స్క్రీనింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించామని చెప్పారు. లాక్‌డౌన్‌లో వలస కూలీలకు ఆహారం అందిస్తున్నామన్నారు.
అలాగే, సామాజిక భౌతిక దూరం పాటించడంలో చాలావరకు అవగాహనకు వచ్చారని తెలిపారు. కరోనా ప్రభావం లేని చోట ఇప్పటికే చాలా సడలింపులు ఇచ్చామని వెల్లడించారు. కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా వస్తున్నాయని, ఆ అలాంటి రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు.
ఇకపోతే, గుజరాత్ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతుంది. గత 24 గంటల్లో గుజరాత్ లో 313 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసులు 4,395 చేరుకున్నాయి. ఈ కేసుల్లో 613 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జయ్యారు.