కరోనా మహమ్మారి.. 24గంటల్లో 1823 కేసులు.. 20 రోజుల పసికందుకు కరోనా

గురువారం, 30 ఏప్రియల్ 2020 (18:39 IST)
భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా మరో 1823 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కోవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 33610కి చేరినట్టు తెలిపింది. కాగా కరోనా మహమ్మారి కారణంగా గురువారం మరో 67 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 1075కు పెరిగింది. 
 
గత 24 గంటల్లో 576 మంది ఈ వ్యాధి నుంచి కోలుకున్నట్టు కేంద్రం తెలిపింది. మొత్తం 33,610 కేసుల్లో ప్రస్తుతం 24,162 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వెల్లడించింది. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,372గా ఉంది. కాగా అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 9,915 మంది కరోనా బారిన పడగా... 432 మంది ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్రం తెలిపింది. 
 
అలాగే మహారాష్ట్రలో కరోనా వైరస్‌ విలయ తాండవం చేస్తోంది. చిన్నాపెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిపై తన ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా రాష్ట్రంలో 20 రోజుల చిన్నారికి కరోనా వైరస్‌ సోకింది. థానే జిల్లాలోని కల్యాణ్‌ టౌన్‌కు చెందిన 20 రోజుల శిశువు కరోనా వైరస్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు