Corona: 6లక్షలకు తగ్గిన క్రియాశీల కేసులు, కొత్తగా 51,667 కేసులు,1,329 మరణాలు
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత అదుపులోకి వస్తోంది. తాజాగా 17,35,781 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..51,667 మందికి పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చుకుంటే కేసుల్లో 4.4 శాతం తగ్గుదల కనిపించింది. తాజాగా 1,329 మంది మృత్యుఒడికి చేరుకున్నారు. ప్రస్తుతం మొత్తం కేసులు 3,01,34,445కి చేరగా.. 3,93,310 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇక నిన్న 64,527 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీలు 2,91,28,267కి చేరాయి. రికవరీ రేటు 96.66 శాతానికి పెరగ్గా.. క్రియాశీల రేటు 2.03 శాతానికి తగ్గింది. ప్రస్తుతం క్రియాశీల కేసులు 6 లక్షలకు పడిపోయాయి. మరోపక్క సోమవారం నుంచి కరోనా టీకా కార్యక్రమంలో వేగం కనిపిస్తోంది. నిన్న ఒక్కరోజే 60,73,319 మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు టీకా తీసుకున్నవారి సంఖ్య 30,79,48,744కి చేరింది.