ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు సౌతాఫ్రికా వణికిపోతుంది. మరోవైపు, కరోనా కొత్త కేసుల నమోదులో దక్షిణాఫ్రికా సరికొత్త రికార్డును నెలకొల్పుతుంది. రోజువారీగా పది వేలకు పైగా ఈ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆ దేశంలో కరోనా నాలుగో దశ వ్యాప్తి మొదలైందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
నిజానికి దక్షిణాఫ్రికాలో రెండు వారాల క్రితం కరోనా పరిస్థితి అదుపులో ఉన్నది. అపుడు పాజిటివిటీ రేటు కేవలం 2 శాతం మాత్రమే. కాన, ఇపుడు ఏకంగా 25 శాతానికి పెరిగింది. రోజువారీ కేసుల సంఖ్య కూడా ఏకంగా 10 వేరకు పైగా పెరిగాయి. ఒకవైపు ఒమిక్రాన్, మరోవైపు సాధారణ కరోనా కేసులతో సౌతాఫ్రికా తల్లడిల్లిపోతోంది.
ఈ పరిస్థితులన్నింటినీ బేరీజు వేసిన సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా మాట్లాడుతూ, ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో కరోనా నాలుగో దశ వ్యాప్తి సాగుతోందన్నారు. మున్ముందు కరోనాతో పాటు ఒమిక్రాన్ సంక్రమణ రేటు మరింతగా పెరిగే అవకాశం ఉందని, అందువల్ల ప్రజలందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలని కోరారు. దేశంలో నెలకొన్న పరిస్థితిని సమీక్షించేందుకు త్వరలోనే జాతీయ కరోనా వైరస్ కమాండ్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.