దేశంలో కరోనా పాజిటివ్ కేసుల తగ్గిపోవడానికి కారణమేంటి?

మంగళవారం, 5 జనవరి 2021 (15:05 IST)
ప్రపంచ దేశాలను వణికించిన కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో ఆరంభంలో మాత్రం తీవ్ర ప్రభావం చూపింది. ఒక దశలో ఒకే రోజు ఏకంగా 95 వేల పై చిలుకు కేసులు నమోదయ్యాయి. కానీ ఎపుడు కూడా ఒక్క రోజులో లక్ష కేసులు నమోదైన దాఖలాలులేవు. అయితే, ప్రస్తుతం ఈ వైరస్ తీవ్రత క్రమంగా తగ్గుతూ వస్తోంది. సెప్టెంబర్​ మధ్య నుంచి నేటికి వస్తున్న కేసుల సంఖ్యే ఇందుకు నిదర్శనం. 
 
దేశంలో యువ జనాభా ఎక్కువగా ఉండడం, హెర్డ్​ ఇమ్యూనిటీ అనేవి కొవిడ్ తగ్గడానికి కారణాలుగా పలువురు ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా వైరస్‌ తీవ్రత ఎక్కువ ఉన్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే. 
 
అయితే, దేశంలో గతకొద్ది రోజులుగా కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. ఈ నేపథ్యంలో దేశంలో వైరస్‌ తీవ్రత తగ్గడం నిజమేనని శాస్త్రవేత్తలు కూడా నిర్ధారిస్తున్నారు. అయితే వ్యాప్తి తగ్గడానికి స్థానిక హెర్డ్‌ ఇమ్యూనిటీతో పాటు దేశంలో యువత జనాభా ఎక్కువగా ఉండటం దోహదం చేసినట్లు పేర్కొంటున్నారు.
 
కాగా, గడచిన 24 గంటల్లో మరో 16375 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. అదేస‌మ‌యంలో 29,091 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,03,56,845కు చేరింది.
 
గడచిన 24 గంట‌ల సమయంలో 201 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,49,850కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 99,75,958 మంది కోలుకున్నారు. 2,31,036 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.
  
కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 17,65,31,997 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,96,236 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.
 
ఇకపోతే, తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 253 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో కరోనాతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 317 మంది కోలుకున్నారు.
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,87,993 కి  చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,81,400 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,554కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 5,039 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 2,793 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 61 కరోనా కేసులు నమోదయ్యాయి.  

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు