భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసులు

శుక్రవారం, 11 సెప్టెంబరు 2020 (10:21 IST)
భారత్‌లో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రోజు రోజుకీ కరోనా కేసుల సంఖ్య విజృంభిస్తున్నాయి. నిత్యం రికార్డుస్థాయిలో పాజిటివ్‌ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో అత్యధికంగా 96,551 పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 45లక్షల 62వేలకు చేరింది. వీరిలో ఇప్పటికే 35లక్షల మంది కోలుకోగా మరో 9లక్షల 43వేల యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
 
ఇక దేశంలో కరోనా సోకి మరణిస్తున్న వారిసంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగించే విషయం. గురువారం ఒక్కరోజే రికార్డుస్థాయిలో 1209 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనా మరణాల సంఖ్య 76,271కి చేరింది. అయితే, కోవిడ్‌-19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతానికిపైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేస్తోంది.
 
దేశంలో నిత్యం కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు భారీగా నిర్వహిస్తుండడంతో, అధిక సంఖ్యలో పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అభిప్రాయపడింది. నిన్న ఒక్కరోజే 11లక్షల 63వేల కొవిడ్‌ టెస్టులు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు 5కోట్ల 40లక్షల శాంపిళ్లకు కొవిడ్‌ టెస్టులు పూర్తిచేసినట్లు పేర్కొంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు