పాజిటివ్ కేసులు కాస్త తగ్గాయ్ గానీ.. మరణాలు పెరిగాయ్

మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (11:13 IST)
దేశంలో కరోనా వైరస్ రెండో అల వ్యాప్తి మరింతగా విస్తరిస్తోంది. ఈ వైరస్ కట్టడికి రాష్ట్రాలన్నీ అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. ఫలితం మాత్రం అంతంతమాత్రంగానే కనిపిస్తోంది. దీంతో పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ముఖ్యంగా, కరోనా రెండో దశ వ్యాప్తి కట్టడికి పలు రాష్ట్రాలు లాక్డౌన్‌, నైట్‌కర్ఫ్యూతో పాటు కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. అయినప్పటికీ మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. 
 
ఇప్పటికే భారత్‌లో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత ఐదు రోజులుగా మూడు లక్షలకుపైగా పాజిటివ్‌ కేసులు, రెండువేలకుపైగా మరణాలు రికార్డవుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. మంగళవారం రోజువారీ కేసులు కాస్త తగ్గినా.. వరుసగా ఆరో రోజు 3 లక్షల కేసులు నమోదవగా.. మరోసారి రెండువేలకుపైగా మరణాలు నమోదయ్యాయి.
 
గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,23,144 పాజిటివ్‌ కేసులు, 2771 మరణాలు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా 2,51,857 మంది కోలుకొని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. 
 
కాగా, కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,76,36,307కు పెరిగింది. ఇప్పటి వరకు 1,45,56,209 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి మొత్తం 1,97,894 మంది ప్రాణాలు వదిలారు. ప్రస్తుతం దేశంలో 28,82,204 యాక్టివ్‌ కేసులున్నాయని చెప్పింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు