కరోనా కల్లోల భారత్ : రాజ్యాంగం మేరకు హెల్త్ ఎమర్జెన్సీ సాధ్యమేనా?

మంగళవారం, 27 ఏప్రియల్ 2021 (09:38 IST)
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి నియంత్రణ చేయిదాటిపోయింది. ఫలితంగా ప్రతి రోజూ లక్షలాది మంది ఈ వైరస్ బారినపడుతుంటే వేలాది మంది మృత్యువాతపడుతున్నారు. ఈ క్రమంలో దేశంలో ఆరోగ్య అత్యయిక పరిస్థితిని విధించాలన్న డిమాండ్లు వస్తున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు కూడా హెల్త్ ఎమర్జెన్సీపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఓ ప్రణాళికను సిద్ధం చేయాలని కేంద్రానికి సూచన చేసింది. 
 
ఈ క్రమంలో భారత రాజ్యాంగం మేరకు దేశంలో ఆరోగ్య ఎమర్జెన్సీ సాధ్యమేనా అనే విషయాన్ని పరిశీలిస్తే, మన రాజ్యాంగం‌లో ‘ఆరోగ్య ఎమర్జెన్సీ’ అనే ప్రస్తావన ఎక్కడా లేదు. నేషనల్‌ ఎమర్జెన్సీ, ఆర్థిక ఎమర్జెన్సీల ప్రస్తావనే ఉంది. అయితే రాజ్యాంగంలోని ఏ అధికరణలు, ఏ చట్టాల ప్రకారం దేశంలో ఆరోగ్య ఎమర్జెన్సీని విధించే అవకాశాలున్నాయనే అంశంపై న్యాయవర్గాల్లో కీలకచర్చలు జరుగుతున్నాయి. 
 
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 352 ప్రకారం నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించారు. తర్వాత దాన్ని సవరించి విదేశీ దాడులు, యుద్ధం, సైనిక తిరుగుబాటు సమయంలోనే ‘ఎమర్జెన్సీ’ విధించేందుకు వీలు కల్పించారు. రాజ్యాంగంలోని 355వ అధికరణ కింద అంతర్గత కల్లోలం చెలరేగినప్పటికీ రాష్ట్రాల్లో రాజ్యాంగ పాలన జరిగేందుకు కేంద్రం చర్యలు తీసుకునే అవకాశం ఉంది. 
 
ఇపుడు కరోనా వైరస్‌ మూలంగా ప్రజల్లో తలెత్తిన భయాందోళనలు, చట్టాలను ప్రజలు ధిక్కరించే అవకాశాల వల్ల తలెత్తిన ‘అంతర్గత కల్లోలాలను’ ఆర్టికల్‌ 355 పేరుతో పరిష్కరించే అవకాశాలున్నాయి. ఆర్టికల్‌ 355 అనేది 352కు పొడిగింపు మాత్రమేనని న్యాయనిపుణులు భావిస్తున్నారు. అంటువ్యాధుల చట్టం-1897, విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం కేంద్రం కఠిన చర్యలు తీసుకునే అవకాశముంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు